Rishab Shetty: తిరుపతిలో రిషబ్ శెట్టి సందడి - ‘కాంతార’ సీక్వెల్ ఉన్నట్లా? లేనట్లా?
దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకున్న తాజా సినిమా ‘కాంతార’. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తిరుపతిలో సందడి చేశాడు.
కన్నడ సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘కాంతార’ సినిమా, తెలుగు, హిందీల్లోనూ సంచలనాలను నమోదు చేస్తున్నది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించడంతో పాటు తెరకెక్కించాడు కూడా. కన్నడలో సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయ్యింది. పదిహేను రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. నెల రోజులు దాటక ముందే అన్ని భాషల్లో వసూళ్లు 200 కోట్ల రూపాయలు దాటింది. ‘కేజీఎఫ్’ లాంటి పాన్ ఇండియన్ హిట్ మూవీని నిర్మించిన విజయ్ కిరగందూర్ 'కాంతార' చిత్రాన్ని నిర్మించారు. మరోసారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్నారు. 'కాంతార'లో అద్భుత నటన కనబర్చిన రిషబ్ శెట్టిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఆయనను మెచ్చుకుంటున్నారు. కర్ణాటక కల్చర్‌లో భాగమైన భూతకోలా సంప్రదాయం గురించి సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
తిరుపతిలో రిషబ్ శెట్టి సందడి
తాజాగా తిరుపతిలో ‘కాంతార’ హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి సందడి చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సందర్భంగా.. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ కు వెళ్లాడు. రిషబ్ శెట్టికి థియేటర్ యజమానులు, అభిమానులు భారీ పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అభిమానులు రిషబ్ పై పూల వర్షం కురిపించారు. రిషబ్ రాకతో జయశ్యాం థియేటర్ ప్రేక్షకులు, అభిమానుల విజల్స్ తో దద్దరిల్లింది. ‘కాంతార’ హీరోతో ఫోటోలు దిగేందుకు సినీ అభిమానులు ఎగబడ్డారు.
రాబోయే సినిమా ‘కాంతార’ కథలాగే ఉండాలి!
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ‘కాంతార’ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేసినట్లు రిషబ్ తెలిపాడు. దేశ సంస్కృత, సాంప్రదాయాలను గౌరవించడం భారతీయులందరి బాధ్యత అన్నాడు. ఈ సినిమాలో వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకూ తన తర్వాత మూవీ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదని చెప్పాడు. కాకపోతే, తన తదుపరి సినిమా కూడా ‘కాంతార’ సినిమా కథలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ‘కాంతార’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని చెప్పాడు. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ రిషబ్ కృతజ్ఞతలు చెప్పాడు.
‘కాంతార’ నిర్మాత ఏం చేయబోతున్నాడు?
‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించాడు విజయ్ కిరగందూర్. ఇప్పుడు ‘కాంతారా’ మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి కూడా సీక్వెల్ తీస్తాడని సినీ పండితులు అంటున్నారు.ఇక ఈ కన్నడ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే, ఆ సినిమాకు అంత పాజిటివ్ టాక్ వస్తోంది.
Read Also: ‘కాంతార’ సినిమాలో ‘వరాహ రూపం’ పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా?