HanuMan Trailer: హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, ‘హనుమాన్’ ట్రైలర్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్!
HanuMan Trailer: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘హనుమాన్’ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. అదిరిపోయే విజువల్స్, తేజ సజ్జ యాక్టింగ్ ఓ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి.
HanuMan Movie Trailer: దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా రూపొందుతోంది. క్యూట్ బ్యూటీ అమృతా అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సింగిల్స్ అలరించాయి. ‘హనుమాన్’ ఆంథమ్, ‘ఆవకాయ.. ఆంజనేయ..’ అనే పాట సైతం అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
అదిరిపోయే విజువల్స్ ట్రీట్
ఆంజనేయుడి స్తోత్రాలతో మొదలైన ‘హనుమాన్‘ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. హనుమంతుడి మహిమతో సూపర్ పవర్స్ దక్కించుకున్న కుర్రాడిగా తేజ సజ్జ కనిపించాడు. “నీ పేరేంటి అన్నయ్యా” అని పిల్లలు అడగడంతో ‘హనుమాన్’ అని గెటప్ శ్రీను చెప్తాడు. అద్భుతమైన పవర్స్ ఉన్న తేజ ధాటికి కుస్తీ వీరులు మట్టికరుస్తారు. అదే సమయంలో హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు విలన్ వినయ్ రాయ్. 'పవర్ సూట్ కాదు, పవరే నాలో ఉండాల'ని అని చెప్తాడు. అలాంటి పవర్ కోసం వెతకాలని తన టీమ్ ను పంపిస్తాడు. వారు తేజ సజ్జ దగ్గరికి వస్తారు. తన తమ్ముడిపై దాడి చేసేందుకు వచ్చిన విలన్స్ టీమ్ ను వరలక్ష్మీ శరత్ కుమార్ చిత్తు చిత్తుగా కొడుకుంది. “మానవాళిని కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా!” అనే సముద్రఖని డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తంగా హనుమాన్ సాయంతో దుష్టశక్తులను తరిమికొట్టే సూపర్ హీరోగా తేజా సజ్జా ఈ సినిమాలో కనిపించనున్నాడు. చెట్టు వేళ్లతో తేజ, హెలికాప్టర్ కిందికి లాగే సీన్ మరింత హైలెట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజిలో కనిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా తగ్గలేదని తెలుస్తోంది. సూపర్ హీరో కథకు భక్తిని కలుపుతూ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడు. ఈ ట్రైలర్ తో సినిమా ఓ రేంజిలో హిట్ కావడం ఖాయమనే భావన ప్రేక్షకులలో కలుగుతోంది.
ఓ కుర్రాడికి ‘హనుమాన్’ వల్ల సూపర్ పవర్స్ వస్తే?
ఈ సినిమాలో హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్ తో కుర్రాడు ఏం చేశాడు? ఈ పవర్స్ కారణంగా తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆయన పవర్స్ ను దేనికోసం వాడాడు? అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తేజ సజ్జా కెరీర్ లోనే హై టెక్నికల్ వాల్యూస్ తో పాటు భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జాంబిరెడ్డి' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోవడంతో ‘హనుమాన్' పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ సినిమాతో మరోసారి సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జనవరి 18న ‘హనుమాన్’ విడుదల
వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జనవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Read Also: మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా- ‘ఆపరేషన్ వాలెంటైన్‘ టీజర్ మరో లెవెల్ అంతే!