Greenko Hyderabad E-Prix: ‘ఫార్ములా ఈ-రేసింగ్’పై థమన్ స్పెషల్ సాంగ్ - సాయి ధరమ్ తేజ్ సర్‌ప్రైజ్!
ఫిబ్రవరి 11 న హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. ఈనెల 11న జరగనున్న ఈ రేసింగ్ కోసం రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ రేస్ పై థమన్ ఓ ప్రత్యేక పాటను రూపొందించారు.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. ఆయన మ్యూజిక్‌కు ఎక్కడాలేని క్రేజ్ ఉంది. సాధారణంగా ఆయన సంగీతాన్ని అందించిన సినిమాల విడుదలకు ముందు ఆ మూవీలో కొన్ని పాటలకు కవర్ సాంగ్ లు చేస్తుంటారు. అలాంటి వీడియోలతో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో థమన్ కు బాగా తెలుసు. త్వరలో హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేబోయే ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ రేసింగ్ పై థమన్ ఓ వీడియో కవర్ సాంగ్ ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసింగ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నెల 11 న జరగనున్న ఫార్ములా రేసింగ్ పోటీలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది. అందులో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను రంగం లోకి దించింది. ఈవెంట్ ప్రమోషన్స్ కోసం థమన్ అదిరిపోయో కవర్ సాంగ్ ను సిద్దం చేశారు. హైదరాబాద్ నేటివిటీ ఎక్కడా తగ్గకుండా పాటను తీర్చిదిద్దారు థమన్. ఈ పాటలో యువనటుడు సాయి ధరమ్ తేజ్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. వీరిద్దరూ కలసి “హైదరాబాద్ జాన్ దేఖో ఫార్ములా-ఈ” అంటూ సాగే పాటకు స్టెప్పులేశారు. ఈ పాటను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. హైదరాబాదీల నుంచి ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగం అయినందుకు కేటీఆర్ థమన్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేసింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రేసింగ్ కోర్టును అధికారులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ఇక ఇండియాలో మొదటిసారిగా జరుగుతున్న ఈ పోటీలపై ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఫార్ములా E రేసు హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8- కిమీ ట్రాక్లో జరుగనుంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉంటాయి. 20,000 మంది ప్రేక్షకులు ఈ రేస్ ను చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఇందులో నాలుగు రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. గ్రాండ్ స్టాండ్ ధర వెయ్యి రూపాయలుగా, చార్జ్ గ్రాండ్ స్టాండ్ టికెట్ ధర నాలుగు వేలుగా, ప్రీమియం గ్రాండ్ స్టాండ్ టికెట్ ధర ఏడు వేలు గా, ఏస్ గ్రాండ్ టికెట్ ధర 10,500 లుగా నిర్ణయించారు. అలాగే 1.25 లక్షల ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.
Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!