God Father: ‘తార్ మార్ తక్కర్ మార్’తో తమన్‌కు తంటాలు - తూచ్, లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటన
మెగాస్టార్ తాజా మూవీ ‘గాడ్ ఫాదర్’లోని 'తార్ మార్ తక్కర్ మార్' లిరికల్ సాంగ్ విడుదల వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు మూవీ మేకర్స్ చెప్తున్నా.. అసలు కారణం వేరే ఉన్నట్లు తెలుస్తున్నది.
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో వస్తున్న తాజా సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమా పరిశ్రమలో మంచి విజయాన్ని సాధించి 'లూసిఫర్' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ సహా పలువురు అగ్ర తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచింది చిత్ర బృందం. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే ఈ సాంగ్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్ ట్యూన్స్ కు సంబంధించి తమన్ పై మాత్రం ఓ రేంజిలో ట్రోల్స్ వస్తున్నాయి.
లిరికల్ సాంగ్ విడుదల వాయిదా
వాస్తవానికి సెప్టెంబర్ 15న ఈ సినిమా నుంచి 'తార్ మార్ తక్కర్ మార్' లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ, చివరకు ఆడియోను మాత్రమే విడుదల చేసి షాకిచ్చింది. ఆ తర్వాత లిరికల్ సాంగ్ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. టెక్నికల్ కారణాల వల్ల ఈ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయలేక పోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీ, సమయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమానైనా అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Due to an unforeseen technical glitch, there is a delay in the lyrical of #ThaarMaarThakkarMaar from #GodFather.
— Konidela Pro Company (@KonidelaPro) September 15, 2022
The release date and time would be announced shortly!#GodFatherOnOct5th
వాయిదాకు కారణం ఇదేనా?
అటు 'తార్ మార్ తక్కర్ మార్' లిరికల్ సాంగ్ విడుదల వాయిదాకు కారణం ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్సే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాట ట్యూన్ రవితేజ ‘క్రాక్’ నుంచి కాపీ కొట్టారంటూ తమన్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లిరికల్ సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియా నుంచి మరిన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భావించి విడుదల నిలిపేసినట్లు తెలుస్తోంది. పాటను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుని విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' సూపర్ సక్సెస్ సాధించింది. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: NMBK Review - 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా?