NMBK Review - 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Nenu Meeku Baga Kavalsinavaadini Movie Review : దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమవుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ రోజు విడుదలైంది.
శ్రీధర్ గాదె
కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ తదితరులు
సినిమా రివ్యూ : నేను మీకు బాగా కావాల్సినవాడిని
రేటింగ్ : 1.5/5
నటీనటులు : కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్, సిద్ధార్ధ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తదితరులు
మాటలు - స్క్రీన్ ప్లే : కిరణ్ అబ్బవరం
సినిమాటోగ్రఫీ : రాజ్ కె. నల్లి
సంగీతం: మణిశర్మ
సమర్పణ : కోడి రామకృష్ణ
నిర్మాత : కోడి దివ్య దీప్తి
రచన, దర్శకత్వం : శ్రీధర్ గాదె
విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 2022
శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమైన సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavaadini Movie). 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలతో యువతను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇందులో హీరో. ఆయన లాస్ట్ రెండు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. మరి, ఈ సినిమా విజయం అందించిందా? లేదా?
కథ (NMBK Story) : వివేక్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్. ఐదు నెలలుగా ప్రతి రోజూ ఫుల్లుగా తాగిన తేజూ (సంజనా ఆనంద్)ను డ్రాప్ చేయడం అతడి డ్యూటీ. ఓ రోజు తేజూని ఎవరో కిడ్నాప్ చేయబోతే కాపాడతాడు. 'ప్రతి రోజూ ఎందుకు తాగుతున్నావ్? కారణం ఏంటి?' అని వివేక్ అడిగితే... తేజూ తన కథ చెబుతుంది. ఆ తర్వాత వివేక్ తన కథ చెబుతాడు. తేజూ అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో అమ్మాయి ఎందుకు తాగుడుకు బానిస అయ్యింది? హ్యాపీ లైఫ్ లీడ్ చేసే వివేక్ ఎందుకు క్యాబ్ డ్రైవర్ అయ్యాడు? ఇద్దరి ప్రేమకథల్లో ఎందుకు హ్యాపీ ఎండింగ్ లేదు? ఒకరి కథలు మరొకరు తెలుసుకున్న తర్వాత వివేక్, తేజూ ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ (NMBK Movie Review) : సినిమాలో ఫస్ట్ సాంగే ఐటమ్ సాంగ్! అందులో స్టార్ హీరోలు వేసిన స్టెప్పులు వేశారు కిరణ్ అబ్బవరం. స్టెప్పులు మాత్రమే కాదు... స్టార్ హీరోలు ఇంతకు ముందు చేసిన సినిమాల్లో సన్నివేశాలను, మెయిన్ ట్విస్టులను తీసుకుని రాసిన కథలో నటించాడని అర్థం కావడానికి ఎక్కువ సేపు పట్టదు. సాంగ్ కంటే ముందు గెటప్ శీను సన్నివేశంతో సినిమా మొదలు అవుతుంది. 'జబర్దస్త్'లో చేసిన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ గెటప్ శీనుతో రిపీట్ చేయించినప్పుడే మనం అర్థం చేసుకోవాలి... తర్వాత సినిమాలో ఇంతకు మించి ఏమీ ఉండదని!
సినిమా మొత్తం మీద చెప్పుకోదగ్గ సీన్లు రెండంటే రెండు ఉన్నాయి... ఒకటి, ఇంటర్వెల్ ట్విస్ట్. రెండు, క్లైమాక్స్ ట్విస్ట్. ఆ రెండూ ఉంటే చాలు... మధ్యలో ఎలాంటి సీన్స్ తీసినా ప్రేక్షకులు చూస్తారని కిరణ్ అబ్బవరం అండ్ టీమ్ అనుకున్నట్లు ఉన్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా కొత్తది ఏమీ కాదు. 'శశిరేఖా పరిణయం' సినిమాలో కృష్ణవంశీ చూపించినదే. మాటలు, స్క్రీన్ ప్లే రాసిన హీరో కిరణ్ అబ్బవరంలో... కథ, ఇతరత్రా విషయాల కంటే తనను తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే తాపత్రయం ఎక్కువ కనబడుతోంది. అవసరం లేకపోయినా ఫైట్లు ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆ ఫైట్లలో కూడా ఓవర్ ఎలివేషన్ షాట్లు ఎక్కువ.
సినిమా మొత్తం మీద అంతో ఇంతో రిలీఫ్ ఇచ్చిన విషయం ఏదైనా ఉందంటే... మణిశర్మ సంగీతం! అది కూడా కొత్తగా ఉందని చెప్పలేం! కానీ, ఉన్నంతలో బెటర్. ఇక, మిగతా విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిర్మాణ విలువలు బావున్నాయి. కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి బాగానే ఖర్చు చేశారు. ఖర్చుతో పాటు కథపై దృష్టి పెట్టి ఉంటే బావుండేది.
నటీనటులు ఎలా చేశారు? : కిరణ్ అబ్బవరం నటన మీద కంటే మాస్ ఎలివేషన్ల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. ఫైట్లు బావున్నాయి. కానీ, ఆయన ఇమేజ్‌కు అవి సూట్ అయ్యాయా? లేదా? అనేది చూసుకోలేదు. పాతిక ముప్ఫై సినిమాలు చేసిన స్టార్ హీరోలకు ఏ విధంగా ఎలివేషన్లు ఇస్తారో... ఆ విధమైన ఎలివేషన్లు ఈ సినిమాలో కిరణ్ అబ్బవరానికి ఇచ్చారు. సినిమా అంతా అయిపోయాక వచ్చిన 'నచ్చావ్ అబ్బాయ్' పాటలో హీరోయిన్ సంజనా ఆనంద్ అందంగా కనిపించారు. సినిమాలో మాత్రం నటిగా తేలిపోయారు. సోనూ ఠాకూర్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాలో కంటే టీవీ షోల్లో బాబా భాస్కర్ ఎక్కువ కామెడీ చేసి ఉంటారు. ఎస్వీ కృష్ణారెడ్డి, సమీర్ వంటి నటీనటులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు తప్ప... వాళ్ళూ చేసింది ఏమీ లేదు. రొటీన్ సీన్లు, రోటీన్ యాక్టింగ్!
Also Read : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ: ఆ అమ్మాయి కథ ఆకట్టుకుందా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో 'మాస్ ఎంటర్‌టైనర్' అని వేసుకున్నారు. బహుశా... ఆ తర్వాత వేసుకోవడం కష్టం అనుకున్నారేమో!? మాస్ జనాలు మెచ్చే అంశాలు ఏవీ సినిమాలో లేవు. లాజిక్స్ సంగతి తీస్తే... పెద్ద లిస్టు ఉంటుంది. సినిమాలో 'డ్రైవర్లు అంటే చులకన' అని హీరో డైలాగ్ చెబుతూ ఉంటారు. డ్రైవర్ల సంగతి పక్కన పెడితే... ప్రేక్షకులు అంటే కిరణ్ అబ్బవరంలో చులకన భావం ఉన్నటుంది. పది పదిహేనేళ్ల క్రితం వచ్చినా ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టం!
Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా?