(Source: Poll of Polls)
Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ: ఆ అమ్మాయి కథ ఆకట్టుకుందా?
AAGMC Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఎలా ఉందంటే?
ఇంద్రగంటి మోహనకృష్ణ
సుధీర్ బాబు, కృతి శెట్టి తదితరులు
సినిమా రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ : పీజీ విందా
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు : బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
రచన, దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 2022
సెన్సిబుల్ సినిమాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తనకు అచ్చివచ్చిన హీరో సుధీర్ బాబుతో తెరకెక్కించిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సమ్మోహనం’ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. తర్వాత ‘వి’తో ఎదురుదెబ్బ తినడంతో తిరిగి తనకు బలమైన జోనర్‌కు వచ్చేశారు. లవ్, ఎమోషనల్ అంశాలకు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు టీజర్, ట్రైలర్లను చూస్తే తెలుస్తోంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న కృతి శెట్టి ‘ఆ అమ్మాయి’గా కనిపించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఇంద్రగంటి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఆ అమ్మాయి కథ ఆకట్టుకుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కథ: నవీన్ (సుధీర్ బాబు) ఆరు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన దర్శకుడు. ఏడో సినిమాలో ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకుంటాడు. తనకు అనుకోకుండా దొరికిన రీల్ లో ఒక అమ్మాయిని చూస్తాడు. ఎంక్వయిరీ చేస్తే తను కంటి డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుస్తుంది. అలేఖ్యకి, తన ఫ్యామిలీకి సినిమాలు అంటే అస్సలు పడదు. అలేఖ్యని నవీన్ ఎలా ఒప్పించాడు? అసలు అలేఖ్య ఫ్యామిలీకి సినిమాలు అంటే ఎందుకు పడదు? ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పేరుకు తగ్గట్లు ఇది ఒక అమ్మాయి కథ. సెన్సిబుల్ సినిమాలు ఆకట్టుకునేలా తీయడం ఇంద్రగంటి మోహనకృష్ణ బలం. గతంలో ఈ జోనర్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీశారు. అస్సలు టైం వేస్ట్ చేయకుండా మొదటి ఫ్రేమ్ నుంచే ఇంద్రగంటి కథలోకి వెళ్లిపోతారు. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఆరు సూపర్ హిట్ సినిమాలు తీయడం, ఏడో సినిమాకు కొత్త అమ్మాయిని అనుకోవడం, అనుకోకుండా దొరికిన్ రీల్‌లోని అమ్మాయి కోసం వెతుకులాట ఇవన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి.
‘ముందు ఒక ఐటం సాంగ్ తీసేద్దాం... తర్వాత కథలో ఎక్కడో ఒకచోట దాన్ని ఇరికిద్దాం.’ లాంటి డైలాగ్స్‌తో నేటి నిర్మాతల తీరును ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. మరోవైపు దర్శకుడి విజన్‌ను నమ్మే ప్రొడ్యూసర్‌ను కూడా చూపించి బ్యాలెన్స్ చేశారు. దీంతోపాటు కాస్టింగ్ కౌచ్, ఫేక్ న్యూస్ వంటి అంశాలను కూడా టచ్ చేశారు. వెన్నెల కిషోర్‌పై రాసిన కామెడీ సీన్స్ నవ్విస్తాయి. అయితే ప్రథమార్థంలో హీరోయిన్‌ను కనుక్కున్నాక సినిమా కొంచెం స్లో అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ ప్రారంభంలో ఫ్లాష్‌బ్యాక్ కొంచెం స్లో అయినా ఆ తర్వాత నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. షూటింగ్ సన్నివేశాల నుంచి సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. హీరోయిన్ అమ్మానాన్నల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. సినిమాలో సంభాషణలు బలంగా ఉన్నాయి.‘నీ కలను చంపుకుంటే నిన్ను నువ్వు చంపుకున్నట్లే.’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
వివేక్ సాగర్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. ‘కొత్త కొత్తగా’ పాట తెరపై కూడా బాగుంది. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ మూడ్‌ను చక్కగా క్యారీ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Also Read: NMBK Review - 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ సినిమాలో కొత్త సుధీర్ బాబును చూడవచ్చు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని నటన కనబరిచాడు. కథ మొత్తం కృతి శెట్టి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఉప్పెన తర్వాత కృతి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తుంది. చాలా కాలం తర్వాత వెన్నెల కిషోర్‌కు మంచి పాత్ర దక్కింది. కో-డైరెక్టర్ బోస్ పాత్రలో నవ్వులు పూయిస్తాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపంచిన శ్రీకాంత్ అయ్యంగార్ అద్భుతంగా నటించారు. హీరో స్నేహితుడిగా రాహుల్ రామకృష్ణ ఆకట్టుకుంటారు.
ఫైనల్‌గా చెప్పాలంటే... ‘ఈ అమ్మాయి కథ’ మిమ్మల్ని నిరాశ పరచదు.
Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా?