Ramayana: ‘రామాయణం’ నుంచి అదిరిపోయే అప్ డేట్, శ్రీరామ నవమి రోజున కీలక ప్రకటన!
నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. శ్రీరామ నవమి రోజున ఈ మూవీకి సంబంధించి దర్శకుడు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
Exciting update from 'Ramayana': దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతారాముడిగా నటించబోతున్నఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది(2025) దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణ్ గా కన్నడ స్టార్ హీరో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నారు. రావణుడి చెల్లి శూర్పణఖ పాత్రతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జాకీ భగ్నానితో తన పెళ్లి తర్వాత రకుల్ నటించబోయే తొలి చిత్రం ‘రామాయణం’ కాబోతోంది.
ఏప్రిల్ 17న ‘రామాయణం’ ప్రకటన
ఇక ‘రామాయణం’ సినిమాకు సంబంధించి ప్రకటన ఏప్రిల్ 17న వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఈ సినిమాను దర్శకుడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణం’ సినిమాలో నటీనటులు ఎవరు? సాంకేతిక బృందంలో ఎవరు ఉంటారు? సినిమా విడుదల ఎప్పుడు? లాంటి కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చిత్రబృందం ఏకంగా 5 సంవత్సరాల సమయాన్ని తీసుకుంది. త్వరలో సినిమా నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
గత 2 నెలలుగా నటీనటుల లుక్ టెస్ట్
గత 2 నెలలుగా ఈ సినిమాలో నటించబోయే యాక్టర్లకు సంబంధించిన లుక్ టెస్ట్, ప్రీ విజువలైజేషన్, టెక్ రిహార్సల్స్ ముంబైతో పాటు లాస్ ఏంజెల్స్ లో నిర్వహించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీపావళి 2025కు ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో VFX ఉన్న నేపథ్యంలో సాధ్యం అవుతుందో? లేదో? అని సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నమిత్ మల్హోత్రా (DNEG)తో కలిసి నితేష్ తివారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెస్ట్ VFX నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం జూలై నుంచి 500 రోజుల పాటు ‘రామాయణం’ కోసం పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
2025 దీపావళి కానుకగా ‘రామాయణం’ తొలి భాగం విడుదల
‘రామాయణం’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నది. మేలో సన్నీ డియోల్ పార్ట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అటు జులైలో యష్ ‘రామాయణం’ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. యష్ పార్ట్ వరకు ఈ సినిమా తొలి భాగంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళి కానుకగా ‘రామాయణం’ తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'లోఫర్' బ్యూటీ!