Devatha July 14th Update: దేవిని ఇప్పటికిప్పుడే నా బిడ్డగా నా ఇంటికి తీసుకెళ్లిపోతానంటూ ఆదిత్య తెగింపు- ఆదిత్య, మాధవ మధ్య మాటల యుద్ధం
దేవిని ఎలాగైనా ఇంటికి రప్పించేలా చెయ్యాలని మాధవ కుట్రలు పన్నుతు ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రామూర్తి దంపతులు బోనాల పండగ కోసం అంతా సిద్ధం అవుతారు. రాధ ని కూడా బోనం ఎత్తుకుని గుడికి రమ్మంటారు కానీ అందుకు ఒప్పుకోదు. ఊర్లో జనాలు నీ గురించి అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలని జానకి అంటే ఒంట్లో బాగోలేదని చెప్పండని రాధ అంటుంది. నువ్వు మా మాట ఎప్పుడు విన్నావ్ అని జానకి అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక అందరూ బోనం ఎత్తుకుని గుడికి బయలుదేరతారు. అటు దేవుడమ్మ వాళ్ళు, ఇటు మాధవ కుటుంబం గుడిలో ఎదురుపడతారు. అమ్మ రాలేదేంటి నాయన అని దేవి మాధవణి అడుగుతుంది. అదేంటి ఇంటి కోడలు బోనం ఎత్తుకుని రాకపోవడం ఏంటని దేవుడమ్మ అడుగుతుంది.
Also Read: అదిరిపోయే సీన్, నిజం తెలుసుకున్న యష్- ఇక కైలాష్ కి దబిడి దిబిడె
ఇంట్లో రుక్మిణి పూజ చేసుకుంటుంది. 'నేను ఎలాగో నా భర్తకి దూరమయ్యా నా బిడ్డని అయినా తనకు దగ్గరయ్యేలా చూడు వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి. ఈ బోనం ఎత్తుకుని అందరి లాగా గుడికి రాలేను. నా కున్న ఒకే ఒక్క కోరిక నా బిడ్డ వల్ల నాయన కాడికి పోవాలి. నా కోరిక తీర్చు తల్లి' అని అమ్మవారికి మొక్కుకుంటుంది. త్వరగా నా భార్యా బిడ్డ నా ఇంటికి చేరేలాగా చెయ్యి తల్లి అని ఆదిత్య దేవుడు ముందు కోరుకుంటాడు. అప్పుడే అక్కడికి మాధవ వస్తాడు. నీ బిడ్డ నీ దగ్గరకి వస్తే మరీ నా బిడ్డ ఏం కావాలి. ఈరోజు వరకు వాళ్ళు ఒక్కరిగానే పెరిగారాని మాధవ అంటాడు. అందుకని నా బిడ్డని నేను వదులుకోవాలా అని ఆదిత్య అంటాడు. రాధ తన తల్లి కాదు, దేవి తన చెల్లి కాదు అని తెలిసిన మరుక్షణం నా బిడ్డ అల్లాడిపోతుందని మాధవ కోపంగా అంటాడు. నువ్వు నీ కూతురు గురించి ఎలా ఆలోచిస్తావో నేను నా కూతురు గురించి అలాగే ఆలోచిస్తానని చెప్తాడు. దేవి నీ కూతురు కాదు నా కూతురు అప్పటికి ఎప్పటికీ నేనే తండ్రిని. పసిగొడ్డుగా తండ్రిగా నన్నే చూసింది నా బిడ్డ గానే పెరిగింది. దేవికి కూడా నేనంటే ఎంత ప్రాణమో నువ్వు చూస్తున్నావ్ గా అని మాధవ అదిత్యని రెచ్చగొడతాడు. నిన్ను నాన్న అనే రోజు ఎప్పటికీ రాదని అంటాడు. మాది రక్త సంబంధం నా కూతురు నా దగ్గరకి త్వరలోనే వస్తుందని ఆదిత్య కోపంగా చెప్తాడు. దేవి గురించి ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.
రుక్మిణి బోనం ఎత్తుకుని పొలంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తుంది. అక్కడకి భాగ్యమ్మ వస్తుంది. నువ్వు ఇక్కడ బోనం ఎందుకు తెచ్చావ్ అని తిడుతుంది. అందరూ ఊర్లో ఉన్న గుడికి వెళ్లారు ఇక్కడికి నేను ఎలా వచ్చేది అత్తమ్మ నన్ను చూస్తుందని ఆవేదన పడుతుంది. కానీ అందుకు భాగ్యమ్మ ఒప్పుకోదు. నీ కష్టాలు తీరాలంటే బోనం గంగమ్మ దగ్గరే దించాలని చెప్తుంది. రుక్మిణి మొహం గుర్తుపట్టకుండా ఉండటం కోసం భాగ్యమ్మ తన మొహానికి పసుపు పూస్తుంది.