Devara: ‘దేవర’ వాయిదా అంటూ రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన టీమ్!
Devara Postpone: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’పై వచ్చిన వాయిదా వార్తలను చిత్రబృందం ఖండించింది.
Devara Release Date: టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా రాదా అనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది. ‘దేవర’ అనుకున్న తేదీకి రాకపోతే మార్చి 30వ తేదీకి ‘టిల్లు స్క్వేర్’ వస్తుందని కొన్ని వార్తలు వినిపించాయి. దీనిపై ‘దేవర’ టీమ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాధానం ఇచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల అవుతుందని మరోసారి నొక్కి చెప్పింది.
‘దేవర’ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మైత్రీ మూవీస్ వారికే వెళ్లే అవకాశాలు ఉన్నాయని తాజాగా అందుతున్న సమాచారం. ఇప్పటికే ‘సలార్’, ‘హనుమాన్’ సినిమాలతో నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ సక్సెస్ చవి చూసింది. ఇదే ఊపులో 'దేవర' తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరితో మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇది వారిద్దరికీ కలిసొచ్చే అంశం అని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మాణరంగంలోకి అడుగు పెట్టాక తీసిన మొదటి రెండు సినిమాలు కొరటాల శివతోనే. మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ కాగా, రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’.
దీంతో ఇప్పుడు తమతో పరిచయం, స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా రూ.110 కోట్లుకు అడుగుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా... మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం అయిన 'దేవర పార్ట్-1' సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
జనవరి 8వ తేదీన విడుదల అయిన గ్లింప్స్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. రిలీజ్ కి ముందే ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియెట్రికల్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 'దేవర' ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకి దక్కించుకుందని వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ తో ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది.