Sunny Deol- Shah Rukh Khan: 16 ఏళ్లుగా మాటల్లేవు - షారుఖ్, సన్నీ డియోల్ మధ్య గొడవేంటి?
చాలా ఏండ్ల తర్వాత షారుఖ్ గురించి మాట్లాడారు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. కింగ్ ఖాన్ తో తనకున్న సినీ అనుబంధంతో పాటు వివాదం గురించి తొలిసారి స్పందించారు.
ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి మిత్రులుగా కొనసాగారు నటులు షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్. ఆ తర్వాత ఇద్దరి మధ్యన తలెత్తిన వివాదాల కారణంగా గత 16 ఏండ్లుగా ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం మానేశారు. తాజాగా మళ్లీ మాట్లాడుకున్నట్లు సన్నీ డియోల్ వెల్లడించారు. తన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గదర్ 2’ను చూసి షారుఖ్ అభినందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా షారుఖ్‌తో ఉన్న సినీ అనుబంధంతో పాటు వివాదాల గురించి ఆయన స్పందించారు.
‘డర్’తో మొదలైన వివాదం!
సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ 1993లో యష్ చోప్రా రూపొందించిన ‘డర్’ చిత్రంలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం కంటే ఏడాది ముందు ‘దీవానా’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు షారుఖ్. ఇందులో షారుఖ్ రొమాంటిక్ హీరోగా కనిపించాడు. ‘డర్’లో మాత్రం నెగెటివ్ పాత్ర పోషించాడు. అయితే, ఈ చిత్రం రిలీజ్ తర్వాత నెగెటివ్ పాత్ర పోషించిన షారుఖ్ కు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. హీరోగా ఉన్న తనకు సరైన గుర్తింపు రాలేదని సన్నీ భావించాడు.
‘డర్’ సినిమా విడుదలైన తర్వాత ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తన కోపాన్ని వెల్లగక్కారు. "నేను యష్ చోప్రాతో మళ్లీ పని చేయను. అతడిపై నాకు నమ్మకం లేదు. నా నమ్మకాన్ని తను వంచించాడు” అని చెప్పారు. అటు ఇండియా టీవీ ‘ఆప్ కి అదాలత్’లోనూ ఆయన ఇదే రకంగా స్పందించారు. “డర్ సినిమా చూసి జనాలు నన్ను ఆదరించారు. వారు షారుఖ్ ఖాన్‌ను కూడా ఇష్టపడ్డారు. సినిమా విషయంలో నాకున్న ఏకైక సమస్య ఏమిటంటే, వారు విలన్‌ని అభిమానిస్తారని నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఓపెన్ హార్ట్ తో సినిమాల్లో పని చేస్తాను. వ్యక్తులను నమ్ముతాను. నమ్మకంతో పనిచేయడం నా నమ్మకం. దురదృష్టవశాత్తూ, ఈ పద్ధతిలో పని చేయని చాలా మంది నటులు, తారలు మనముందున్నారు. బహుశా వారు తమ స్టార్‌డమ్‌ని పొందాలనుకునే మార్గం అదే కావచ్చు” అని పరోక్షంగా షారుఖ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అప్పటి నుంచి షారుఖ్, సన్నీ మధ్య మాటలు లేవు.
‘గదర్ 2’తో వివాదానికి పుల్ స్టాఫ్ పడినట్లేనా?
షారుఖ్ ఇటీవల సన్నీడియోల్ ‘గదర్2’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా నిర్వహించిన Ask SRK సెషన్‌లో తాను ‘గదర్2’ చిత్రాన్ని చూశానని చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరు మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తాజాగా సన్నీ వెల్లడించారు. “షారుక్ ఖాన్ ‘గదర్2’ సినిమా చూశాడు. అంతకు ముందు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సినిమా హిట్ పట్ల తను చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అప్పుడు నేను అతడి భార్య (గౌరీ ఖాన్), కొడుకు (ఆర్యన్ ఖాన్)తో మాట్లాడాను. వారు సినిమా చూసి మెచ్చుకోవడం సంతోషంగా ఉంది” అని చెప్పారు.
Read Also: అమితాబ్ బచ్చన్ ‘భారతరత్నం’ - బిగ్ బీకి రాఖీ కట్టిన మమతా బెనర్జీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial