Pawan Kalyan: హరి హరా.. పవన్ సినిమా జీవితకాలం లేటేనా? ఇప్పట్లో మోక్షం కలిగేనా?
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. మూడేళ్ళ క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ రావడం లేదు.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ, రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. అయితే రీఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలకే పవన్ మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో, 'హరి హర వీరమల్లు' లాంటి ఒరిజినల్ కంటెంట్ మూవీ లేట్ అవుతూ వస్తోంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. ఇది పవర్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే 'వకీల్ సాబ్' తర్వాత పవన్ 27వ చిత్రంగా 2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. ఇంకా సెట్స్ మీదనే ఉంది. ఈ మూడేళ్ళలో ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. మరోవైపు దీని తర్వాత పట్టాలెక్కిన రెండు రీమేక్ సినిమాలు 'భీమ్లా నాయక్', 'బ్రో' షూటింగులు పూర్తి చేసుకొని థియేటర్లలోకి వచ్చేసాయి.. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అలానే ఇటీవల సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన OG సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై కన్ఫర్మేషన్ లేదు కానీ.. ఈ ఏడాది చివరి నాటికి ప్రోడక్ట్ రెడీ అయిపోతుందని సమాచారం. కానీ ఎప్పుడో మొదలు పెట్టిన 'హరి హర వీరమల్లు'.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తలపెట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల పరిస్థితి ఏంటి? ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అనేది అస్సలు అర్థం కావడం లేదు.
నిజానికి హరి హర వీరమల్లు చిత్రానికి పేరు పెట్టకముందే 2021లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత 2022 సమ్మర్ రిలీజ్ అన్నారు.. ఇదే క్రమంలో 2023 వేసవికి షిఫ్ట్ చేసారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన పోస్టర్ లో అసలు విడుదల గురించే ప్రస్తావించలేదు. మరోవైపు 'భవదీయుడు భగత్ సింగ్' గా అనౌన్స్ చేసిన హరీష్ సినిమా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' గా పేరు మార్చుకుంది కానీ స్పీడ్ గా షూటింగ్ జరుపుకోవడం లేదు. ఉస్తాద్ అన్నా అప్పుడప్పుడు చిత్రీకరణ జరుపుకుంటోంది కానీ.. క్రిష్ సినిమానే ఎప్పుడు తిరిగి సెట్స్ మీదకు వెళ్తుందనేది తెలియడం లేదు. దీనికి కారణం అది ఒరిజినల్ కంటెంట్ తో రూపొందే భారీ సినిమా కావడమే అని అర్థమవుతోంది.
2024లో ఏపీ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, తక్కువ రోజుల్లో కంప్లీట్ అయ్యే రీమేక్ చిత్రాలకే ఓటేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ విధంగా తక్కువ కాల్షీట్స్ తో తనకు రావాల్సిన రెమ్యునరేషన్ వచ్చేస్తుంది. కానీ 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో అలా కాదు. భారీ సెట్టింగులు, వందల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లతో పెద్ద పెద్ద షెడ్యూల్స్ ప్లాన్ చెయ్యాల్సి వస్తోంది. రీమేక్ సినిమాలకు అప్పుడప్పుడు డేట్స్ ఇచ్చినా సరిపోతుంది కానీ.. రోజుల తరబడి షూట్ చెయ్యాల్సిన హిస్టారికల్ మూవీకి అలా వీలుపడదు. అందులోనూ తక్కువ రోజులు పట్టే సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారట. కీలకమైన సీన్లు, ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ బకాయి వుందని టాక్ వినిపిస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో పవన్ ఏ మేరకు డేట్స్ సర్దుబాటు చేయగలడనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే 'హరి హర వీరమల్లు' నిర్మాత మాత్రం పవన్ డేట్స్ ఇస్తే, ఈ ఇయర్ ఎండింగ్ కి సినిమాని పూర్తి చేస్తామని చెబుతున్నారు. పరిస్థితిని బట్టి వచ్చే ఎన్నికలకి ముందు లేదా తర్వాత రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వీరమల్లుని రెండు భాగాలుగా చేయడానికి అవకాశం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే జరిగితే కనీసం ఫస్ట్ పార్ట్ అయినా ఎప్పటికి విడుదల చేస్తారనేది ఇప్పుడు చెప్పడం కష్టమే అవుతుంది. రానున్న రోజుల్లోనైనా వీరమల్లు విషయాలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Also Read: 'చంద్రముఖి 2' ట్రైలర్: రజినీ స్వాగ్‌ను రాఘవ లారెన్స్ మ్యాచ్ చేయగలిగాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial