Vijay Sethupathi's Viduthalai Update : 'బాహుబలి', 'కెజియఫ్' రూటులో విజయ్ సేతుపతి 'విడుతలై'
రాజమౌళి 'బాహుబలి', ప్రశాంత్ నీల్ 'కెజియఫ్' రూటులో వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న 'విడుతలై' ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని వివరాలకు వార్త చదవండి.
![Vijay Sethupathi's Viduthalai Update : 'బాహుబలి', 'కెజియఫ్' రూటులో విజయ్ సేతుపతి 'విడుతలై' Vijay Sethupathi's Viduthalai Update Vetrimaaran Following Baahubali KGF 2 Formula For Soori Starrer Viduthalai Vijay Sethupathi's Viduthalai Update : 'బాహుబలి', 'కెజియఫ్' రూటులో విజయ్ సేతుపతి 'విడుతలై'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/04/41035e8d4ab6d934733639bbe64a774a1662286606696313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్, ప్రాంఛైజీ ఫిలిమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, గతంలో సీక్వెల్స్ సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా తక్కువ. సీక్వెల్స్ ఫ్లాప్ అనే ముద్రను దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి', ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన 'కెజియఫ్' (KGF 2) చిత్రాలు తుడిచి పెట్టేశాయి. రెండేసి భాగాలుగా వచ్చిన ఆ రెండు చిత్రాలూ భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆ సినిమాలో బాటలో విజయ్ సేతుపతి, వెట్రి మారన్ కాంబినేషన్‌లో వస్తున్న 'విడుతలై' కూడా చేరుతోంది.
రెండు భాగాలుగా 'విడుతలై'
జాతీయ పురస్కార గ్రహీత వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వాతియర్‌గా, సూరి (Tamil Comedian Soori) హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'విడుతలై' (Viduthalai Movie). ఆర్.ఏస్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జైయంట్ మూవీస్ పతాకంపై ఎల్‌డ్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ రోజు వెట్రిమారన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు తెలిపారు.
'విడుతలై 1' షూటింగ్ పూర్తి
Viduthalai Part 1 Shooting Completed : 'విడుతలై' రెండు భాగాలుగా రూపొందుతోందని వెల్లడించిన నిర్మాతలు, తొలి భాగం చిత్రీకరణ పూర్తి అయ్యిందని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ''అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందంతో 'విడుతలై' మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఖర్చుకు వెనుకాడకుండా రెండు భాగాలను తెరకెక్కిస్తున్నాం. తమిళ పరిశ్రమలో ఇప్పటి వరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో మా సినిమా ఒకటిగా నిలవనుంది'' అని చెప్పారు.
పది కోట్ల విలువ చేసే సెట్స్...
'విడుతలై' కోసం కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో పది కోట్ల రూపాయలు విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ వేశామని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఆ సెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా మరో భారీ సెట్ నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకెనాల్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బల్గేరియా నుంచి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం అందులో పాల్గొంటున్నారు.
Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్
విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'విడుతలై 1', 'విడుతలై 2' విడుదల తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
విజయ్ సేతుపతి కేవలం కథానాయకుడి పాత్రలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తున్నారు. సూరి హీరో అయినప్పటికీ... తన పాత్రకు ప్రాముఖ్యం ఉండటంతో ఈ సినిమా చేస్తున్నారట.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)