Merry Christmas Trailer: తెలుగులోనూ విజయ్ సేతుపతి, కత్రినాల 'మేరీ క్రిస్మస్' - సస్పెన్స్ థ్రిల్లర్‌తో 'అంధాధున్' డైరెక్టర్!
Merry Christmas Trailer: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన చిత్రం 'మేరీ క్రిస్మస్'. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
Merry Christmas Trailer: కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘మేరీ క్రిస్మస్’. బద్లాపూర్, అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి స్పెషల్ గా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర బృందం... తాజాగా తెలుగు ట్రైలర్ ను ఆవిష్కరించింది.
''ఈ ప్రపంచం మొదలైనప్పటి నుంచి మనం ఒక క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ క్షణం ఎప్పుడైతే మన దాకా వస్తుందో అప్పుడు అర్థమవుతుంది.. మన ఇన్నేళ్ల జీవితంలో ఎదురు చూస్తున్నది ఆ క్షణం కోసమేనని'' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది క్రిస్మస్ పండుగ రోజు రాత్రి ఇద్దరు అపరిచితులైన కత్రినా కైఫ్ - విజయ్ సేతుపతి మధ్య జరిగిన సంఘటలను చూపిస్తుంది.
ఇద్దరూ రాత్రి సమయంలో షికారు చేయడం, తాగుతూ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కలిసి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడాన్ని మనం ట్రైలర్ లో చూడొచ్చు. అయితే ఉన్నట్టుండి వారి ఈవ్ డేట్ విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. విజయ్ - కత్రినా పాత్రలు ఇమాజినరీ లోకంలో మాట్లాడుతున్నట్లు, ఇద్దరూ ఏదో దాస్తున్నట్లు మాట్లాడుకోవడం వంటివి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
''మనం ప్రేమించిన వాళ్ళు చనిపోవడమా? లేక మనపై వాళ్ళ ప్రేమ చచ్చిపోవడమా? బాధైతే మనకేగా'' అని కత్రినా అంటుంటే... ''కొన్నిసార్లు సాక్రిఫైజ్ కంటే వైలెన్స్ బెటర్'' అని సేతుపతి చెప్పడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. కథేంటనేది ట్రైలర్ లో పెద్దగా రివీల్ చెయ్యకపోయినా, ఇందులో ఓ పాప పాత్ర కీలకమని తెలుస్తోంది. ఇక చివర్లో కత్రీనా కైఫ్ పాపతో కలిసి థియేటర్ లో కూర్చొని ఉండగా... ముందు సీట్ లో విజయ్ కూర్చొని ఉంటాడు. ''అప్పుడు ఓ భయంకర రాక్షసుడు తల్లిని పిల్లని ఇద్దరినీ ఎత్తుకొని పారిపోయాడు'' అని చెప్తుండగా, కత్రీనా - పాప ఇద్దరూ అదృశ్యమవడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.
Also Read: ఓటీటీలోకి నితిన్ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ విభిన్నమైన కథతో, సస్పెన్స్ అండ్ థ్రిల్ కు గురి చేసే అంశాలతో 'మేరీ క్రిస్మస్' సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తొలిసారిగా కలిసి నటిస్తున్న కత్రినా కైఫ్ - విజయ్ లు ఆకట్టుకున్నారు. ఇద్దరి మధ్య కిస్సింగ్ సీన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఇందులో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్, రాధికా శరత్ కుమార్, రాధికా ఆప్టే, అశ్వినీ కల్సేఖర్ తదితరులు నటించారు. అయితే ట్రైలర్ లో మిగతా ప్రధాన పాత్రధారులెవరూ కనిపించలేదు.
ఇకపోతే 'మేరీ క్రిస్మస్' సినిమా తెలుగు వెర్షన్ లో సేతుపతి పాత్రకు డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. సొంత వాయిస్ కు అలవాటు పడిపోయిన అభిమానులకు అది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. "వి విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్" అనే ట్యూన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గా ట్రైలర్ అంతటా విపిస్తుంది. సినిమా థీమ్ కు తగ్గట్టుగా విజువల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ & టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్స్ పై రమేష్ తౌరానీస్, సంజయ్ రౌత్రే, జయ తౌరానీ, కేవల్ గార్గ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చగా, మధు నీలకందన్సినిమాటోగ్రఫీ నిర్వహించారు. పూజా లధా సూర్తి ఎడిటర్ గా, మయూర్ శర్మ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేసారు. 'మేరీ క్రిస్మస్' సినిమా పొంగల్ కానుకగా 2024 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 'జవాన్' సినిమాలో విలన్ గా నటించి బాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి, ఇప్పుడు హీరోగా ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Also Read: హిందీలోకి 'మెగా' డిజాస్టర్ మూవీ.. వద్దు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్న ఫ్యాన్స్!