Acharya: హిందీలోకి 'మెగా' డిజాస్టర్ మూవీ.. వద్దు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్న ఫ్యాన్స్!
Acharya Hindi Release: చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం, ఇన్నాళ్లకు హిందీలో రిలీజ్ కాబోతోంది.
Acharya Hindi Release: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 2022 ఏప్రిల్ 29న రిలీజయింది. అయితే ఆ అంచనాలను అందుకోవడం విఫలమై, బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. నాలుగో రోజుకే చేతులెత్తేసింది. ఇది అప్పటికి చిరు కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణించాయి. ఈ సినిమా ఫలితం మెగా అభిమానులకు ఒక పీడకలలా, చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మూవీ వార్తల్లో నిలవడం ఫ్యాన్స్ ని మళ్ళీ కలవరపెడుతోంది.
మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం, RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత చెర్రీ చేసిన చిత్రం అవ్వడం, అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మూవీ కావడంతో 'ఆచార్య' పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా మిగతా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత కేవలం హిందీలో మాత్రమే విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూసిన తర్వాత నార్త్ లో థియేట్రికల్ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలో రిలీజ్ కు రెడీ అయింది.
'ఆచార్య' హిందీ డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ సొంతం చేసుకుంది. సినిమా వచ్చి ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత తాజాగా హిందీ వెర్షన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. పొంగల్ స్పెషల్ గా 2024 జనవరి 11న డైరెక్ట్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేస్తున్నట్టుగా అఫిషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలో హిందీ ట్రైలర్ ను సోషల్ మీడియా మాధ్యమాలలో రిలీజ్ చేసారు. తెలుగులో బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మారిన ఎన్నో కమర్షియల్ సినిమాలు బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ లో భారీ సక్సెస్ అందుకున్నాయి. మన దగ్గర ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని ఈ మెగా మూవీ హిందీ ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందేమో చూడాలి.
#Acharya trailer is here! Get ready for an entertainment extravaganza!#MegastarChiranjeevi #RamCharan #PenMovies pic.twitter.com/lzrhAsBaoI
— Pen Movies (@PenMovies) January 8, 2024
'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, అజయ్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెత్ తో నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఇదిలా ఉంటే 'ఆచార్య' ప్రభావం నుంచి బయటకు వచ్చిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం 'దేవర' వంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అత్యున్నత సాంకేతికతతో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్టుగా వచ్చిన టీజర్ మిలియన్ల వ్యూస్ లైక్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. గత రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇలాంటి టైంలో కొరటాల తెరకెక్కించిన డిజాస్టర్ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నారంటూ అప్డేట్ బయటకు రావడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'దేవర' చుట్టూ నెలకొన్న బజ్ ని క్యాష్ చేసుకోడానికే పెన్ స్టూడియోస్ ఇప్పుడు 'ఆచార్య' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.