Tollywood Divided: రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! ‘మంచు’కు ముందుంది అసలు పరీక్ష !
"మా"కు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాతో టాలీవుడ్ రెండు వర్గాలుగా మారిపోయినట్లయింది. ఏ కార్యక్రమం చేపట్టినా ఏక తాటిపైకి రావడం కష్టం. ఇది హామీలను అమలు చేసే ప్రక్రియలో "మంచు"కు సవాల్‌గా మారనుంది.
"ఎన్నికల వరకే రెండు ప్యానళ్లు .. అయిపోయిన తర్వాత అంతా ఒకటే" అని పదే పదే చెప్పిన టాలీవుడ్ నటులు ఇప్పుడు అది మర్చిపోయారు. ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. ప్రచారంలో అనుకున్న మాటలు నటుల మధ్య విభజన రేఖ గీయగా ఎన్నికలు, కౌంటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు వారి మధ్య వ్యక్తిగత సంబంధాలను కూడా దూరం చేశాయి. ఈ విషయం ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం రాజీనామా చేయడమే కాదు.. ఆ సందర్భంగా కొంత మంది వ్యక్తం చేసిన ఆవేదన, పెట్టుకున్న కన్నీరు ఇక టాలీవుడ్ ఎప్పటికీ ఒకటి కాదనే విషయానికి సాక్ష్యంగా మారింది.
"మా" కార్యవర్గంలో ఇక ఒక వర్గమే !
పంతం పట్టి "మా" ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ బాబు ఫ్యామిలీకి టాలీవుడ్‌లోని ఓ బలమైన వర్గం నుంచి మద్దతు లభించదని తేలిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ రాజీనామా చేయడమే కాదు... మంచు విష్ణుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అంటే మా సహకారం ఇక ఉండదు.. మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పడమేనని అనుకోవచ్చు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుోతంది. ఎన్నికల సందర్బంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు. కానీ మంచు విష్ణు మాత్రం భారీ హామీలు ఇచ్చారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను రెండేళ్లలో అమలు చేయాల్సి ఉంటుంది. సొంత ఖర్చులో మా బిల్డింగ్ కట్టిస్తామని విష్ణు ప్రకటించారు. దాని కోసం కొన్ని కోట్లను విష్ణు ఖర్చు పెట్టాల్సి ఉంటుది. అనేక సంక్షేమ పథకాలను కూడా విష్ణు ప్రకటించారు.
Also Read : ‘మా’ ఎన్నికల్లో ట్రాజెడీ సీన్లు.. బెనర్జీ కన్నీరు.. తనీష్ ఆవేదన!
"మా" ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌కు ఒక వర్గం హాజరవుతుందా ?
" మా" భవనాన్ని మంచు విష్ణు తన డబ్బులతో కట్టించినప్పటికీ ఇతర సంక్షేమ పథకాలలను " మా" నిధులతోనే నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది. "మా"కు ప్రత్యేకమైన ఆదాయవనరులు లేవు. ఇస్తే నటులు విరాళాలు ఇవ్వాలి. లేకపోతే ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఈ రెండింటికి ప్రస్తుతం ఓ వర్గం దూరం కావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ నటులు .. కలసి కట్టుగా ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెండు వర్గాల్లోనూ లేకపోయినా .. ఎవరికీ దూరం కాకూడదన్న కారణంగా ప్రోగ్రామ్స్ పెట్టినా స్టార్ హీరోలు హాజరు కారు. అందుకే ఇక మా ఆధ్వర్యంలో ఈవెంట్స్ నిర్వహించడం అంత తేలిక కాదు. అవి జరగకపోతే నిధులు రావు.
Also Read : ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా .. ఇప్పటికిప్పుడు కొత్త సంఘం లేనట్లే !
సమస్యల పరిష్కారం అవ్వాలన్నా టాలీవుడ్ ఏక తాటి మీదకు రావాల్సిందే !
గెలిచిన తరవాత మోహన్ బాబు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయగలగాలంటే ప్రభుత్వలతో సమన్వయం చేసుకోవాలి. మోహన్ బాబుకు ఇదేమంత తేలికైన విషయం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే "మా"లో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ కలిసి వచ్చే అవకాశం లేదు. మోహన్ బాబు చేపట్టే కార్యక్రమాలకు వారు హాజరు కావడం డౌటే. ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లాలన్నా.. వాళ్లను పిలిపించి సన్మానం చేయాలన్నా.. అందరం ఒకటే అని చెబితేనే వారు వస్తారు.. అంగీకరిస్తారు. లేకపోతే వారు కూడా ఆసక్తి చూపించరు.
Also Read : ‘మా’ చీలకుండా కాపాడుకోవాలి..! ‘పెదరాయుడి’కి మొదటి సవాల్ ఇదే!
గెలిచిన తర్వాత చేసిన వివాదాస్పద ప్రకటనలతోనే పెరిగిన దూరం !
ఎన్నికల ఫలితాల తర్వాత వీలైనంత వరకూ సంయమనం పాటిస్తే సమస్య పరిష్కారమయ్యేది కానీ.. చిరంజీవి గురించి.. రామ్ చరణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటంతోనే సమస్య ప్రారంభమయింది. వారికి కలుపుకుని వెళ్లే ఉద్దేశం లేదని ప్రకాష్ రాజ్ ప్యానల్ భావించింది. ప్రస్తుత పరిస్థితికి ఆ పరిణామాలే కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి... విజయం సాధించిన వాళ్లు బాధ్యత తీసుకుంటే టాలీవుడ్ ఏక తాటిపైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ తీసుకుంటారా లేదా అన్నదే కీలకం.
Also Read : బాలయ్య షోలో ముందుగా మంచు ఫ్యామిలీ.. ఆ తరువాత మెగాఫ్యామిలీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి