Tollywood : సినీ కార్మికుల వేతనాలు పెంపు, ఎంత పెంచారంటే?
Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపుపై టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలను పెంపుపై ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉమ్మడి నిర్ణయాన్ని ప్రకటించాయి.
Tollywood : తెలుగు చలన చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ కార్మికుల వేతనాలు పెంపుచూ నిర్ణయం తీసుకుంది. అయితే వేతనాల పెంపునకు సంబంధిత వివరాలను ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉమ్మడిగా వెల్లడించాయి. 2018లోని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఒప్పందం ప్రకారం సినీ కార్మికుల వేతనంపై 30 శాతం (పెద్ద సినిమాలకు), 15 శాతం (చిన్న సినిమాలకు) పెంచినట్టు ప్రకటించాయి. ఈ నిర్ణయం ఈ ఏడాది జులై 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుందని తెలిపాయి. చిన్న, పెద్ద సినిమాల నిర్థరణను చలన చిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ల కమిటీ నిర్ణయిస్తుంది.
వేతనాల కోసం ఉద్యమబాట
"మూడోళ్లకోసారి వేతనాలను పెంచాలని నిబంధనలు ఉన్నా కనీసం నాలుగున్నరేళ్లు దాటినా వేతనాలు పెంచలేదు. దశాబ్దాలుగా నమ్ముకున్న సినీ ఇండస్ట్రీని వదల్లేక.. ఆర్థిక ఇబ్బందులతో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’’ అంటూ ఆగ్రహంతో ఇటీవల ఉద్యమబాట పట్టారు తెలుగు సినీ కార్మికులు. జూబ్లిహిల్స్ లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. తెలుగు సినిమాలోని 24 విభాగాలకు చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు. జూన్ 22న ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు సినీ కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. సినీ కార్మికులు అడిగిన దాని కంటే 12శాతం అధికంగా వేతనాలు ఇస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు అప్పట్లో ప్రకటించారు. షూటింగ్ లు ఆగకూడదనే ఉద్దేశంతో ఎవరు ఎక్కువ వేతనం ఇస్తారో వాళ్ల షూటింగ్ లకు వెళ్తామని ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ జూన్ 22న తెలిపారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పట్లో సినీ కార్మికులు ఆందోళనను విరమించారు.
కార్మికుల డిమాండ్లు పరిగణనలోకి
తెలుగు సినీ కార్మికులకు నిర్మాతల మండలి వేతనాల పెంపుపై గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులు కోరుతున్న 30 శాతం వేతనాలను పెంపునకు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపింది. 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సినీ కార్మికులు ఇప్పటికే షూటింగ్ లు నిలిపివేశారు. ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం ప్రతి మూడేళ్లకొకసారి సినీ కార్మికులకు వేతనాలు పెంచాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వేతనాలు పెంపు ఆలస్యం అయింది. అయితే ఈసారి తమ డిమాండ్లను పరిష్కారించాలని ఫిల్మ్ ఫెడరేషన్ తేల్చిచెప్పింది. లేని పక్షంలో సెప్టెంబర్ 16 నుంచి సమ్మె సిద్ధమని ప్రకటించింది. దీంతో సినీ కార్మికుల డిమాండ్లను పరిగణనలోనికి తీసుకుని 30 శాతం వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు.
Also Read : God Father First Single: తమన్ మళ్లీ కాపీ కొట్టేశావా? ‘గాడ్ ఫాదర్’ ట్యూన్ పై నెటిజన్ల ట్రోల్స్!
Also Read : Saakini Daakini: ఫైటింగ్‌లో బ్రూస్లీని మించిపోయిన రెజీనా, నివేదా - ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!