Siddhu Jonnalagadda: జోకర్ కాదు, సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్ - అర్షద్ వార్సీ కామెంట్స్‌పై డీజే టిల్లు ఫైర్
ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలను డీజే టిల్లు తీవ్రంగా ఖండించారు. ఆయన జోకర్ కాదు, ‘కల్కి 2898 ఏడీ‘ మూవీ సక్సెస్ వెనుకున్న స్ట్రాంగ్ పిల్లర్ అన్నారు.
Siddhu Jonnalagadda on Arshad Warsi comments: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు నటీనటులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు అర్షద్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. సినిమా పరిశ్రలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా బాధాకరం అంటున్నారు.
ఆ గౌరవాన్ని కాపాడుకోండి- సిద్ధు
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను చెప్పే రైట్స్ ఉన్నాయన్న ఆయన.. చెప్పే పద్దతి బాగుండాలని హితవు పలికారు. “ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. మన ఇష్టాఇష్టాలు, ఫ్యాన్సీల ప్రకారం ఒక్కో నటుడి సినిమాలను ఇష్టపడుతాం. మరికొంత మంది సినిమాలను విమర్శిస్తాం. అయితే, ఆయా సినిమాల మీద తమ అభిప్రాయాలను ఎలా వ్యక్తపరుస్తారు అనేది చాలా ముఖ్యం. ప్రత్యేకించి మీరు సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. నిర్మాణాత్మక విమర్శల వరకు ఓకే. కానీ, జోకర్ లాంటి పదాలను వాడటం సరికాదు. ‘కల్కి 2898 ఏడీ‘ అంటే జోక్ కాదు, గర్వం. భారతీయ సినీ పరిశ్రమలో నాగ్ అశ్విన్ ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన సినిమాను తెరకెక్కించడం ఫన్నీ కాదు. ప్రభాస్ అన్న భారతీయ సినిమా పరిశ్రమలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు. అతడి ఫెయిల్యూర్స్ కంటే, సాధించిన విజయాలే ఎక్కువ. ‘కల్కి 2898 ఏడీ‘ సినిమా సక్సెస్ వెనుకున్న బలమైన పిల్లర్స్ లో ఆయన ఒకరు. నేను ఆయన ఫ్యాన్ బాయ్ గా ఉన్నా, వాస్తవాలు మాత్రమే చెప్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం. దయ చేసి పరస్పర గౌరవాన్ని కాపాడుకోండి” అని టిల్లు బాయ్ రాసుకొచ్చారు.
Siddhu Jonnalagadda on Arshad Warsi comments..
— Prabhas 💗 (@Lokesh_072005) August 21, 2024
Mad respect anna🙏🏻❤️#Prabhas𓃵 #Kalki2898AD #Fauji pic.twitter.com/d5nI3wCZg6
ప్రభాస్ పై అర్షద్ అనుచిత వ్యాఖ్యలు
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్షద్ వార్సీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ ను తలపించిందన్నారు. మేకర్స్ అతడిని ఎందుకు అలా చిత్రీకరించారో అర్థం కావట్లేదన్నారు. మరోవైపు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు. అర్షద్ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అర్షద్ వార్సీ, ప్రభాస్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి 2898 ఏడీ’ ప్రభంజనం
ప్రభాస్, నాగ్ అశ్విన్ కలిసి తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.