Ayushi Patel Chusuko: బాయ్‌ఫ్రెండ్ ఛీట్ చేస్తే బాధపడాలా? - ఆయుషికి త్రిగుణ్ చెప్పిన మాట బావుందమ్మా, మీరూ చూడండి
యువ కథానాయకుడు త్రిగుణ్, 'కలియుగం పట్టణంలో' ఫేమ్ ఆయుషి పటేల్ జంటగా నటించిన మ్యూజికల్ వీడియో సాంగ్ 'చూసుకో'. యూట్యూబ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
''కరెక్ట్ పర్సన్ (మంచోడి)ని లవ్ చేశానని అనుకున్నా. తప్పు చేశా'' అని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పిందో అమ్మాయి. ''రాంగ్ పర్సన్ (చెడ్డోడి) గురించి ఆలోచించడం కూడా తప్పే'' అని సమాధానం ఇచ్చాడు ఆమె ముందున్న అబ్బాయి. వాళ్లిద్దరూ కలిసి యువతకు సందేశం ఇచ్చారు. అయితే... అదేదో క్లాస్ పీకినట్టు కాదు. ఓ అందమైన మెలోడీతో, మంచి పాటతో! ఆ పాటలో అబ్బాయి హీరో త్రిగుణ్ అయితే... ఆ అందమైన అమ్మాయి ఆయుషి పటేల్! ఆ పాట పేరు 'చూసుకో'
యువతను ఆకట్టుకుంటున్న 'చూసుకో'
'కథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువకుడు త్రిగుణ్. ఆయన అసలు పేరు అదిత్ అరుణ్. తర్వాత పేరు మార్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ 'కొండా'తో పాటు 'తుంగభద్ర', '24 కిస్సెస్', 'డియర్ మేఘ', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన 'చూసుకో' అంటూ ఇండిపెండెంట్ మ్యూజికల్ వీడియో సాంగ్ చేశారు. అందులో 'కలియుగం పట్టణంలో' ఫేమ్ ఆయుషి పటేల్ ఆయనకు జోడీగా నటించారు.
అనగనగా ఓ అమ్మాయి (ఆయుషి పటేల్) పబ్‌కి వెళుతుంది. అక్కడ బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కనపడతాడు. దాంతో బాధ పడుతూ అమ్మాయి బయటకు వస్తుంది. అది తలచుకుంటూ కంటతడి పెడుతుంది. అప్పుడు ఆమె జీవితంలోకి వచ్చే అబ్బాయిగా త్రిగుణ్ కనిపించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ బావుంది.
'చూసుకో' అంటూ సాగే ఈ పాటను లేటెస్ట్ యూత్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి (Yasaswi Kondepudi), హరిణి ఇవటూరి (Harini Ivaturi) సంయుక్తంగా ఆలపించారు. సురేష్ బాణిశెట్టి సాహిత్యాన్ని అందించగా... అన్వేష్ రావు కగిటాల బాణీ సమకూర్చారు. కేరళలోని అందమైన ప్రదేశాల్లో పాటను చిత్రీకరించడంతో విజువల్ పరంగా సాంగ్ మరింత అందంగా ఉంది.
ఆయుషి అందానికి ప్రేక్షకులు ఫిదా!
'చూసుకో...'లో ఆయుషి పటేల్ అందానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె పెర్ఫార్మన్స్ సూపర్ అంటూ యూట్యూబ్‌లో సాంగ్ కింద కామెంట్స్ చేస్తున్నారు. లవ్లీ హీరోయిన్ అంటూ కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా క్లోజప్ షాట్స్ చూస్తే... ఆయుషి ముఖారవిందం చూసి అబ్బాయిలు చూపు తిప్పుకోవడం కష్టమే.
Also Read: 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?
సాంగ్ చివర్లో 'ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటో తెలుసా? నీ నవ్వు. అది నీ ముఖం మీద చాలా బావుంటుంది' అని త్రిగుణ్ చెబితే... 'కోల్పోయిన అదే ప్రేమ మనల్ని కోరుకునే వ్యక్తి దగ్గర నుంచి వచ్చినప్పుడు గుర్తించాలి' అని ఆయుషి చెప్పే డైలాగ్ యువతకు సందేశమే. చక్కటి సందేశాన్ని అందమైన మెలోడీలో ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందీ 'చూసుకో' సాంగ్!
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
మార్చి 22న ఆయుషి సినిమా విడుదల
ప్రస్తుతం ఆయుషీ పటేల్ కథానాయికగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మార్చి 22న ఆమె నటించిన 'కలియుగం పట్టణంలో' థియేటర్లలో విడుదల కానుంది. అది కాకుండా మరో మూడు సినిమాలు చేస్తున్నారు. అన్నట్టు... ఆయుషి పటేల్ తెలుగమ్మాయే.