Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ లెజెండరీ క్రికెటర్ కూడా ఉన్నారు! ఇంతకీ, ఆయన ఎవరో తెలుసా?
ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన యువ హీరోల్లో నాని (Hero Nani) ఒకరు. ఆయన నటన నచ్చి, ఆయన వ్యక్తిత్వం మెచ్చి ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు 'నేచురల్ స్టార్'. నానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఓ అమ్మాయి అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో 'నాని ఫ్యాన్ గాళ్' అని అకౌంట్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడామె యూట్యూబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తోంది. నాని అభిమానుల్లో ఆరేళ్ళ పిల్లల నుంచి అరవై ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు ఉన్నారని చెప్పాలి. అందులో లెజెండరీ క్రికెటర్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
నానికి ముత్తయ్య మురళీధరన్ ఫ్యాన్!
హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా ఇటీవల '800' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్, లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అది. ఆ వేడుకలో నానితో తాను ఓసారి మాట్లాడినట్లు ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. అప్పుడు తాను నానికి అభిమానిని అనే విషయం చెప్పలేదు.
అక్టోబర్ 6న '800' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు మీడియాతో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడారు. అప్పుడు 'మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు?' అని ప్రశ్నించగా... ''తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు, సూపర్ హీరోలు ఉన్నారు. అందరూ అద్భుతంగా నటిస్తున్నారు. అయితే... నాకు నాని అంటే ఇష్టం. ఆయన నటన వైవిధ్యంగా ఉంటుంది. యాక్షన్ కంటే డ్రామా, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు 'ఈగ', 'జెర్సీ', ఇంకా ఆయన నటించిన సినిమాలు చూశా. శ్రీలంకతో తమిళం లేదా హిందీలో డబ్బింగ్ చేసిన సినిమాలు ఎక్కువ విడుదల అవుతాయి. అందుకని, నాకు తెలుగు టైటిల్స్ గుర్తు లేవు'' అని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. అదీ సంగతి!
శ్రీలంకలో తెలుగు సినిమాకు పెరుగుతోన్న ఆదరణ!
ప్రస్తుతం శ్రీలంకలో తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోందని ముత్తయ్య మురళీధరన్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇంతకు ముందు చెప్పినట్లు శ్రీలంకలో ఇంతకు ముందు తమిళ, హిందీ సినిమాలు ఎక్కువ విడుదల అయ్యేవి. తెలుగు తక్కువ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమా కూడా టాప్ పొజిషన్ కు చేరుకుంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం', 'పుష్ప' సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అయ్యాయి. శ్రీలంక ప్రజలు సైతం ఆ సినిమాలు చూశారు'' అని చెప్పారు.
Also Read : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
'800' సినిమా విషయానికి వస్తే... ప్రముఖ తెలుగు నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దగ్గర దర్శకత్వ శాఖలో చాలా ఏళ్లు పని చేసిన ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial