Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka News | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టరీతిన మాట్లాడటం తగదన్నారు.
Bhatti Vikramarka says BRS MLAs in touch with congress | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాంబు పేల్చారు. గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వంపై, కలెక్టర్లపై సైతం తనకు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నాడని చెప్పారు. కేఆర్ మాట్లాడే మాటలతో ఆయన మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ ప్లే చేయాలని ఆశిస్తున్నన్నట్లు భట్టి తెలిపారు. తమ ప్రభుత్వం ఒక్క సంవత్సరమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత వాటితో పాటు కొత్త సమస్యలు ఉంటాయి. తెలంగాణ మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు. మావి ఉమ్మడి నిర్ణయాలు. కానీ కేటీఆర్ ఇంకా భ్రమల్లో బతుకుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పీకడం ఎవరివల్ల కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్ లో ఉన్నారు. అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీ నేతలు కలవడం సహజం. మేం ప్రతి విషయంపై ఫోకస్ చేస్తూ వెళ్తున్నాం. ప్రోగ్రెసివ్ థింకింగ్, వెల్ఫేర్, డెవలప్మెంట్ అనే అంశాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి అంశాన్ని డైరీ సీరియల్ లాగా చేసుకొని బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్లలాగే ఉంటుందని కేటీఆర్ అనుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు బాకీ, రైతుల విజయోత్సవాలపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: రైతులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఏడాదిగా రైతులను దగా చేసి, రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అని ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం 54,280 ఖర్చు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఖర్చు చేయక తప్పదన్నారు. రైతులకు బాకీ పడ్డ రూ. 40 వేల కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నారా? రుణమాఫీ ఎగ్గొట్టి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా, రైతు భరోసా బోగస్ చేసి రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా రేవంత్ రెడ్డి? ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగనా? కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టారు. నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పి సగం మందికి మొండి చెయ్యి చూపారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు అని హరీష్ రావు మండిపడ్డారు.
మీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ...
రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు
ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు
కౌలు రైతులకు మరో 3,000 కోట్లు
రైతు కూలీలకు 16,00 కోట్లు
అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు
అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు)
ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారు. ముందు వీటిని విడుదల చేసి తరువాత విజయోత్సవాలు చేసుకోవాలని హరీష్ రావు సూచించారు.