Thalapathy Vijay: దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?
తమిళ స్టార్ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ‘విజయ్68’ తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Thalapathy Vijay: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక్క తమిళ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తమిళ్ నాడులో ఎక్కడ చూసినా విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే ఆయన సినిమాలక బై బై చెప్పి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తారనే ప్రచారం రావడంతో రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. ఇప్పుడు ఇదే తమిళనాట చర్చనీయాంశమైంది.
‘విజయ్68’ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి..
విజయ్ ‘లియో’ సినిమా తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభుతో ‘విజయ్68’ సినిమా చేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. ఇప్పుడీ వార్త తమిళ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. విజయ్ సినిమాలకు బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి విజయ్ ఇప్పటికే తన స్నిహితులు, పలువురు రాజకీయ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.
పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్తారా?
విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు తమిళ మీడియాలో ప్రచారం అవుతన్నప్పటి నుంచీ విజయ్ అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషకరమైన వార్తే అయినా పూర్తిగా సినిమాలకు దూరం అవుతాడనే ప్రచారం రావడం కూడా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పరు అనే టాక్ నడుస్తోంది. ‘విజయ్68’ తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ యాక్టివిటీలో బిజీ ఉంటారని తెలుస్తోంది. వచ్చే 2026 ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తారట. ఆ ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తారని అంటున్నారు. మరి విజయ్ కొన్నాళ్లు మాత్రమే సినిమాలకు దూరం ఉంటారా లేదా పూర్తిగా బ్రేక్ ఇస్తారా అనేది చూడాలి. దీనిపై విజయ్ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్ లో ఇస్తారేమో చూడాలి.
పార్టీ పెడతారా లేదా పార్టీలో చేరతారా?
తమిళనాడులో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంజీఆర్ నుంచీ ఈ సాంప్రదాయం మొదలైందనే చెప్పొచ్చు. అయితే ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి అద్బుతాలు సృష్టించారు. తర్వాత కమల్ హాసన్, శరత్ కుమార్ లాంటి వారు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అంతగా రాణించలేకపోయారు. ఇక రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ కోవలో విజయ్ రాజకీయాల్లోకి రావడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా లేదా ఏదైనా పార్టీలో చేరతారా అని అడిగితే కొత్తగా పార్టీ పెడతారనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.
విస్తృతంగా సేవా కార్యక్రమాలు..
విజయ్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటారు. ఇప్పటికే తమిళనాట ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విజయ్. తాజాగా ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆ సేవా కార్యక్రమాలను స్పీడప్ చేస్తున్నారు విజయ్. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా నియోజకవర్గాల నుంచి ఒక్కోనియోజకవర్గంలో స్కూల్ టాపర్లను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేస్తున్నారని టాక్. అలాగే ఇటీవల విద్యార్థుల ప్రశంసా కార్యక్రమంలో విజయ్ ఓటు హక్కు గురించి అవగాహన కల్పించడం, ఆయన హావభావాలు, ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవన్ని విజయ్ పొలిటికల్ ఎంట్రీ ను కంఫర్మ్ చేస్తున్నాయని అంటున్నారు తమిళ పొలిటికల్ నిపుణులు.
Also Read: ఆ టాలీవుడ్ హీరోలిద్దరు సంస్కారవంతులు - తమన్నా పొగడ్తల వర్షం, మరి మిగతా హీరోలు?