Nagarjuna: విలన్ క్యారెక్టర్లలో టాలీవుడ్ టాప్ స్టార్స్... 'కూలీ'తో నాగ్... ఆయనకు ముందు చిరు, బాలయ్య, వెంకీ చేసిన విలనిజం తెలుసా?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్లు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. అయితే వాళ్ళు విలన్ రోల్స్ చేశారని తెలుసా? ఏయే సినిమాల్లో విలన్‌గా చేశారో తెలుసుకోండి

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఈ నలుగురి పేర్లు చెబితే తెరపై మనకు అద్భుతమైన హీరోయిజం పండించిన క్యారెక్టర్లు ఎన్నో గుర్తుకు వస్తాయి. అయితే ఈ స్టార్స్ విలన్ రోల్స్ చేశారని తెలుసా? ఏయే సినిమాల్లో విలన్‌గా చేశారో తెలుసుకోండి
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నాగార్జున విలన్ రోల్ పోషిస్తున్నారు. 40 ఏళ్ల కెరీర్ లో మొదటిసారి ప్రతినాయకుడి పాత్రలో పోషిస్తున్న నాగార్జున, టాలీవుడ్ నాలుగు మూల స్తంభాల్లో ఒకరిగా పేరుపొందారు. ఈ విలన్ రోల్ తో ఆయన తన సమకాలీనులైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ సరసన చేరుతున్నారు. ఎందుకంటే... వాళ్ళు ముగ్గురూ తమ కెరీర్‌లో విలన్ రోల్ ఎప్పుడో పోషించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా మెగాస్టార్
మెగాస్టార్ సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో విలన్ గా పలు సినిమాల్లో నటించారు. ఇది కథ కాదు, కాళి, పున్నమినాగు, మోసగాడు,47 రోజులు, కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి సినిమాల్లో పూర్తి విలన్ గా రాణీ కాసుల రంగమ్మ, కోతల రాయుడు,నకిలీ మనిషి, తిరుగులేని మనిషి లాంటి సినిమాల్లో యాంటీ హీరోగా నటించారు ఆయన. అక్కడి నుండి మెగాస్టార్ గా ఎదిగి రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్ ని ఏలారు. ఎంతో మంది దర్శకులు, హీరోలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్.
విలన్‌గానూ నటించిన నటసింహం
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో విలన్ గా నటించిన విషయం ఇప్పటి జనరేషన్ లో చాలామందికి తెలియదు. అది కూడా హీరోగా ఆయన పీక్లో ఉండగానే చేశారు. అదే 'సుల్తాన్' సినిమా. 'సమరసింహారెడ్డి' లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నటించిన సినిమా 'సుల్తాన్'. అందులో విలన్‌గా కనిపిస్తారు ఆయన. భారతదేశానికి చక్రవర్తి కావాలనుకుని టెర్రరిస్టులతో చేతులు కలిపే వ్యక్తిగా ఆయన విలనీ పండించారు ఆ మూవీలో. అదే సినిమాలో హీరోగానూ పృథ్వి అనే మరో పాత్రలో కూడా ఆయన కనిపిస్తారు. అంతే కాదు సీనియర్ హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ఇది.
విలన్‌గా వెంకటేష్ -వద్దన్న ఆడియన్స్
కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన విక్టరీ వెంకటేష్ విలన్‌గా నటించిన మూవీ 'నాగవల్లి'. రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా 'చంద్రముఖి' సినిమాకు స్పిన్ ఆఫ్ మూవీగా డైరెక్టర్ వాసు 'నాగవల్లి' తీశారు. ఈ సినిమాలో నాగభైరవ రాజ శేఖరగా వెంకటేష్ కనిపిస్తారు. ఈ సినిమాలో హీరోగా కూడా Dr. విజయ్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా విలన్ పాత్రలో వెంకటేష్ నటన ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు 'కూలీ'తో ఆ ముగ్గురి సరసన నాగ్
తమ కెరీర్ లో ఎప్పుడో విలన్ పాత్రలు చేసేసిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ సరసన 'కూలీ' సినిమాతో నాగార్జున కూడా చేరుతున్నారు. అది కూడా రజనీకాంత్ కు అపోజిట్ గా. నిజానికి గతంలో RGV తీసిన 'అంతం'లో నాగార్జునది యాంటి హీరో పాత్ర. గ్యాంగ్ స్టర్ గా మర్డర్లు చేసే క్యారెక్టర్. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అదే సినిమా స్ఫూర్తితో RGV 1998లో తీసిన 'సత్య' కల్ట్ క్లాసిక్ కావడం విశేషం.





















