KJ Yesudas: యేసుదాస్‌కు ప్రతిష్టాత్మక ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు - సాయిపల్లవి, అనిరుథ్ రవిచందర్‌లకు కలైమామణి పురస్కారాలు
MS Subbulakshmi Award: తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి భారతీయార్, కలైమామణి అవార్డులను ప్రకటించింది. ఫేమస్ సింగర్ యేసుదాస్‌కు ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు ప్రకటించారు.

Tamilnadu Government Awards To Yesudas Sai Pallavi Anirudh Ravichander: తమిళనాడు ప్రభుత్వం సినీ రంగంలో ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. కళ, సంస్కృతికి కృషి చేసిన కళాకారులకు ఎంఎస్ సుబ్బులక్ష్మి, భారతీయార్, కలైమామణి అవార్డులను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఫేమస్ సింగర్ కేజే యేసుదాస్, హీరోయిన్ సాయి పల్లవి, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అవార్డులు అందుకున్నారు.
ఎవరికి... ఏ అవార్డులు?
- సంగీతానికి చేసిన విశేష కృషికి సింగర్ కేజే యేసుదాస్‌కు ప్రతిష్టాత్మక సుబ్బులక్ష్మి అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇక 2021 సంవత్సరానికి నటుడు ఎస్జే సూర్య, హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ లింగుస్వామి, స్టంట్ కొరియోగ్రాఫర్ సూపర్ సుబ్బరాయన్, సెట్ డిజైనర్ ఎం.జయకుమార్ కలైమామణి అవార్డులు సొంతం చేసుకున్నారు. వీరితో పాటే టీవీ యాక్టర్ పీకే కమలేష్ కూడా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్నారు.
- 2022 ఏడాదికి యాక్టర్ విక్రమ్ ప్రభు, లిరిక్ రైటర్ వివేక, జయ వీసీ గుహనాథన్, ప్రజా సంబందాల అధికారి డైమండ్ బాబు, స్టిల్స్ ఫోటోగ్రాఫర్ లక్ష్మీకాంతన్‌లకు కలైమామణి పురస్కారాలు ప్రకటించారు. వీరితో పాటు టీవీ నటి ఓలి గాయత్రి కళా రంగానికి చేసిన విశేష సేవలకు పురస్కారం కైవసం చేసుకున్నారు.
- 2023 సంవత్సరానికి నటుడు మణికందన్, జార్జ్ మరియన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సింగర్ శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండి అకా సంతోష్ కుమార్, ప్రజా సంబంధాల అధికారి నిక్కిల్ మురుగన్‌లు కలైమామణి అవార్డులు అందుకోనున్నారు. టీవీ యాక్టర్స్ ఎస్‌పీ ఉమాశంకర్ బాబు, అళగన్ తమిళ్ మణిలను కూడా అవార్డులు వరించాయి.
1954 నుంచి...
ఈ అవార్డులను సీఎం స్టాలిన్ అక్టోబరులో నటులకు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతకు గోల్డ్ మెడల్‌తో పాటు ఓ సర్టిఫికెట్ అందిస్తారు. తమిళనాడు ప్రభుత్వ కళ, సంస్కృతి డైరెక్టరేట్ యూనిట్... తమినాడు ఇయల్ ఇసై నాటక మండలి ప్రధానం చేస్తుంది. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. 1954 నుంచి తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోంది.
సంగీతం, నాటకం, డ్యాన్స్, చిత్రకళ, సినిమా, సాహిత్యం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందిస్తారు. తమిళనాడులోనే అత్యున్నత పురస్కారం ఇదే. ఇప్పటికే కమల్ హాసన్, ఇళయరాజా, రజినీకాంత్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వైఎస్ సుధారఘునాథన్ వంటి ప్రముఖులు ఈ పురస్కారం అందుకున్నారు.





















