Happy Birthday Mahesh Babu: రీల్ హీరో to రియల్ హీరో: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ రోజు. అంటే మహేశ్ బాబు పుట్టినరోజు. ఈరోజుతో 48 ఏళ్ళు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితం గురించి తెలుసుకుందాం.
నటశేఖర కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. నటనలో స్క్రీన్ ప్రెజెన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. 'ప్రిన్స్' గా, 'సూపర్ స్టార్'గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు.
మహేష్ అనే పేరులోనే ఏదో మ్యాజిక్ ఉందంటారు సినీ అభిమానులు. హాలీవుడ్ హీరోలను తలదన్నే పిజిక్ తో స్టన్నింగ్ లుక్స్ లో కనిపించే మహేశ్.. ఎప్పటికీ అమ్మాయిలకు కలల రాకుమారుడే. ఆయనకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఏళ్ళు గడిచే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా మారిపోతున్నాడు. నేటితో ఆయన మరో ఏడాదిని పూర్తి చేసుకుని, 49వ పడిలోకి అడుగుపెడున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
మహేశ్ బాబు బాల్యం, బాలనటుడిగా తెరంగేట్రం..
కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాస్‌లో జన్మించాడు ఘట్టమనేని మహేశ్ బాబు. అతనికి రమేష్ బాబు అనే బ్రదర్ తో పాటుగా.. పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే సిస్టర్స్ ఉన్నారు. తండ్రి హీరో కావడంతో చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణానికి అలవాటు పడిన మహేష్.. నాలుగేళ్ళ వయసులోనే తన అన్న రమేశ్ బాబుతో కలిసి 'నీడ' చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత 1983లో 'పోరాటం' సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. మొదటి మూవీ అయినా, ఎలాంటి బెరుకు లేకుండా కెమెరా ముందు నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇదే క్రమంలో తన తండ్రి హీరోగా నటించిన పలు చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. 'శంఖారావం' 'బజారు రౌడీ', 'ముగ్గురు కొడుకులు', 'కొడుకు దిద్దిన కాపురం', 'గూఢచారి 117', 'అన్న-తమ్ముడు', 'బాలచంద్రుడు' వంటి చిత్రాలతో అలరించాడు. అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కొనేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
అరంగేట్రంతోనే నంది అవార్డ్..
1999 లో 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు మహేశ్ బాబు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సాధించి, డెబ్యూ హీరోగా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'యువరాజు' సినిమా కూడా మంచి విజయం సాధించింది. రెండో సినిమాకే ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకే చెల్లింది. 'మురారి' మూవీతో తనలోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసాడు మహేశ్. 'టక్కరి దొంగ' 'ఒక్కడు' సినిమాలు అతడికి మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. 'నిజం' చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న ప్రిన్స్.. 'నాని' వంటి ప్రయోగాత్మక సినిమాతో ప్లాప్ రుచిచూసాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్' 'అతడు' సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
'పోకిరి'తో ఇండస్ట్రీ రికార్డ్..
2006 లో వచ్చిన 'పోకిరి' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. మహేశ్ బాబును సూపర్ స్టార్ గా ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత మరో సక్సెస్ అందుకోడానికి అగ్ర హీరోకి ఐదేళ్లు పట్టింది. 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' వంటి చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'దూకుడు' మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, మహేశ్ ను మళ్ళీ రేసులో నిలబెట్టింది. ఇదే క్రమంలో 'బిజినెస్ మ్యాన్' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు ఘన విజయం సాధించాయి. '1 నేనొక్కడినే' చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఫ్యాన్స్ కు ఫేవరేట్ మూవీగా నిలిచింది. అయితే 'ఆగడు' 'బ్రహ్మోత్సవం' 'స్పైడర్' సినిమాలు మాత్రం గట్టి దెబ్బ కొట్టాయి.
'శ్రీమంతుడు' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. 'భరత్ అనే నేను' చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' 'సర్కారు వారి పాట' సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మహేష్ బాబు స్టార్ పవర్ ఏంటో చూపించాయి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో చేతులు కలపబోతున్నారు. ఇప్పటిదాకా పాన్ ఇండియా గురించి ఆలోచించని మహేష్.. ఈసారి ఏకంగా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు. SSMB29 మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
బెస్ట్ యాక్టర్ అవార్డుల్లో చిరంజీవి తర్వాత మహేషే..
హీరోగా 24 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. ఇప్పటి వరకూ 27 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలను 8 సార్లు (రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు) అందుకున్నారు. అలానే 5 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటుగా, నాలుగు సైమా అవార్డులు దక్కించుకున్నారు. ఇవే కాకుండా జీ సినీ అవార్డ్స్, ఐఫా ఉత్సవం లాంటి మరికొన్ని పురస్కారాలు మహేష్ ఖాతాలో ఉన్నాయి.
రియల్ హీరో మహేశ్..
మహేష్ బాబు నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. తన సేవాగుణంతో అంతకంటే మంచి పేరు తెచ్చుకున్నారు. తన సంపాదనలో 30 శాతం సమాజ సేవకు వెచ్చిస్తూ, 'రియల్ హీరో' అనిపించుకున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ, తన మంచి మనసును చాటుకుంటున్నారు. అలానే తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
నిర్మాతగా మహేశ్..
అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్న మహేశ్ బాబు.. తండ్రి మాదిరిగానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. GMB ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. తాను నటించే సినిమాలలో నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాదు.. ఇతర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ విధంగా తీసిన 'మేజర్' మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తన తోటి హీరోలకు మద్దతుగా నిలవడానికి మహేశ్ ఎప్పుడూ ముందే ఉంటారు. 'జల్సా' 'బాద్ షా' 'ఆచార్య' వంటి చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు.
పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్..
'వంశీ' సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ను మహేశ్ బాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గౌతమ్ కృష్ణ, సితార వంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లను సమానంగా లీడ్ చేస్తున్న అతి తక్కువ మంది హీరోలలో మహేష్ ఒకరని చెప్పొచ్చు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అందుకే ఆయన్ని 'పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్' అంటుంటారు.
Also Read: అందుకే మహేష్ బాబు రీమేక్స్ చేయడు - తనకు తాను పెట్టుకున్న రూల్స్ ఇవే!
నేడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులు, సోదరుడు మరణించిన తర్వాత మహేశ్ జరుపుకుంటున్న మొదటి బర్త్ డే కావడంతో, అభిమానులు సైతం ఈరోజును ప్రత్యేకంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆన్ లైన్ లోనే కాదు, ఆఫ్ లైన్ లోనూ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 'బిజినెస్ మ్యాన్' 4K చిత్రాన్ని రీరిలీజ్ చేసారు. మరోవైపు తోటి నటీనటులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ అందిస్తున్నారు. ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న మన 'సూపర్ స్టార్', రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ''ABP దేశం'' ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.