NTR Career Turning Movies: ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!
Why Sr NTR Is Trend Setter : ఎన్టీఆర్ తన తర్వాత తరంలో వచ్చిన హీరోలకు ధీటుగా కమర్షియల్ చిత్రాలు సైతం చేశారు. ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన, తెలుగు కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐదు సినిమాలు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రాముడు అయినా, కృష్ణుడు అయినా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావే (Nandamuri Taraka Rama Rao). తెలుగు తెరపై ప్రేక్షకులు చూసిన భగవత్ స్వరూపం ఆయన. కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణిక, జానపద సినిమాలు చేశారు. సాంఘీక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అయితే, తన తర్వాత తరం రాకతో ఒకానొక దశలో ఎన్టీఆర్ పనైపోయిందని కామెంట్లు సైతం కొందరి నోటి వెంట వచ్చాయి. విమర్శలకు విజయాలతో ఎన్టీఆర్ బదులు ఇచ్చారు. ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్స్ కింద నిలిచిన ఐదు కమర్షియల్ సినిమాలు ఏవో చూద్దాం!
'ఆడవి రాముడు' స్టెప్పేస్తే...
అభిమానులు డబ్బులు విసిరారు!
'ఆరేసుకోబోయి పారేసుకున్నాను...' పాట ఈతరం ప్రేక్షకులను సైతం ఎంతో బాగా ఆకట్టుకుంది. అప్పట్లో అయితే థియేటర్లలో సంచలనం సృష్టించింది. అంతకు ముందు సినిమాల్లో కనిపించిన ఎన్టీఆర్ వేరు, 'అడివి రాముడు'లో ఎన్టీఆర్ వేరు. ఆయన అలా స్టెప్పులు వేస్తుంటే... ఆడియన్స్, మరీ అభిమానులు ఆనందం పట్టలేక తెరపైకి డబ్బులు విసిరారు. పేపర్స్ చింపి విసరడానికి బదులు తెరపై డబ్బులు విసరడం అనే సంస్కృతి 'అడివి రాముడు'తో మొదలైంది.
ఎన్టీఆర్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి సినిమా 'అడివి రాముడు'. కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం చెప్పిన చిత్రమిది. అన్నగారు కమర్షియల్ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించిన చిత్రమిది. వసూళ్ల రికార్డులు సైతం తిరగరాసిన సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు తెలుగు సినిమా కలెక్షన్లు కోటి రూపాయలే. ఈ సినిమా ఏడాదిలో రూ. నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ సరసన జయప్రద, జయసుధ హీరోయిన్లుగా నటించారు.
'వేటగాడు' వసూళ్ల వేట...
ఎన్టీఆర్ రేటు పెరిగేనంట!
ఎన్టీఆర్ సినిమాల్లో 'వేటగాడు' సినిమాది ప్రత్యేక స్థానం! నిర్మాతల శ్రేయస్సే తనకు ముఖ్యమని ఎప్పుడూ ఎన్టీఆర్ చెబుతూ ఉండేవారు. అందుకని, పారితోషికాన్ని ఎక్కువగా పెంచేవారు కాదు! అయితే... 'అడివి రాముడు' నాలుగు కోట్లకు పైగా వసూలు చేయడం, 'వేటగాడు' సైతం భారీ విజయం సాధించడంతో ఆయనకు నిర్మాతలే ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 'వేటగాడు' తర్వాత ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు తీసుకునే రేటు పది లక్షల రూపాయలకు పెరిగింది.
'వేటగాడు' సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవి జోడీ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా 'ఆకు చాటు పిందె తడిసే...' పాట అప్పట్లో సెన్సేషన్. ఇప్పటికీ ఆ సాంగ్ సెన్సేషనే. 'బడిపంతులు' సినిమాలో తనకు మానవరాలిగా నటించిన అమ్మాయి, తన జోడీగా అంటే ఎన్టీఆర్ తొలుత ఒప్పుకోలేదు. అయితే... ఆయన్ను రాఘవేంద్ర రావు ఒప్పించారు.
ఎన్టీఆర్ 'సర్దార్ పాపారాయుడు'...
డ్యూయల్ రోల్స్‌కు సక్సెస్ ఫార్ములా!
డ్యూయల్ రోల్స్ హీరోలు చేయడం సక్సెస్ ఫార్ములా! దీనికి ఊపిరి పోసిన సినిమా ఎన్టీఆర్ 'సర్దార్ పాపారాయుడు' అని చెప్పాలి. ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకుడు. ఒకరికి వయసైనట్టు, మరొకరు యువకుడు అన్నట్టు చూపించడమనే ట్రెండ్ ఈ సినిమాతో మొదలైంది.
'సర్దార్ పాపారాయుడు'లో ముసలి పాత్ర చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోరని కథ చెప్పడానికి దాసరి వెళ్ళే ముందు ఆయనతో చాలా మంది చెప్పారట. అయితే, కథలో ముసలి పాత్ర తాను చేస్తానని, యంగ్ రోల్ మరొక హీరోతో చేయించమని ఎన్టీఆర్ చెబితే... ఆయన స్టార్ డమ్, అభిమానులు ఆయన నుంచి ఆశించే పాటల కోసం యంగ్ రోల్ కూడా ఆయనతో చేయించారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత హీరోలు అందరూ ఆ విధంగా డ్యూయల్ రోల్ సినిమాలు చేశారు.
ఎస్పీ రంజిత్ కుమార్...
పోలీస్ 'కొండవీటి సింహం'
పోలీస్ పాత్రలకు హీరోయిజం ఉంటుంది. అందుకని, ప్రతి హీరో కెరీర్ లో ఒక్క పోలీస్ సినిమా అయినా సరే చేయాలని అనుకుంటారు. అసలు, పోలీస్ క్యారెక్టర్లు అంత క్రేజ్ తీసుకొచ్చిన సినిమా అంటే 'కొండవీటి సింహం'.
'సర్దార్ పాపారాయుడు' తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన చిత్రాల్లో 'కొండవీటి సింహం' ఒకటి. దీనికి రాఘవేంద్ర రావు దర్శకుడు. సినిమాలో ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రను దర్శకుడు చూపించిన తీరుకు, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
'బొబ్బిలి పులి' అండ్ దేశభక్తి...
ఇప్పటికీ చిత్రసీమకు స్ఫూర్తి!
సినిమాల్లో దేశభక్తి ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా! చట్టంతో, ప్రభుత్వంలో తమ కోసం పోరాడే నాయకుడిని ప్రజలు ఎప్పటికీ హీరోలా చూస్తారు. అటువంటి కథతో దాసరి తీసిన సినిమా 'బొబ్బిలి పులి'. చట్టంలో లొసుగుల్ని ఎత్తిచూపే కథానాయకుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు.
Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ, స్వర్ణ పతకంతో సత్కారం!
ఎన్టీఆర్ 'తెలుగుదేశం' పార్టీ స్థాపించిన తర్వాత విడుదలైన తొలి చిత్రమిది. ఆయన రాజకీయ ప్రవేశం కారణంగా 'బొబ్బిలి పులి'కి సెన్సార్ నుంచి సమస్యలు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ వార్త సంచనలం కావడంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని ఇందిరా గాంధీ, కేంద్ర సమాచారశాఖ మంత్రి వసంత సాథే చూసి అభ్యంతరాలు లేవని చెప్పారు.
ఈ ఐదు సినిమాలతో పాటు 'జస్టిస్ చౌదరి'లో న్యాయమూర్తి పాత్రకు ఓ ట్రెండ్ సెట్టర్. పౌరాణిక చిత్రమైనా, జానపదమైనా, వాణిజ్య హంగులతో రూపొందిన సినిమాల్లో అయినా ప్రేక్షకులకు ఏదో ఒక సందేశం ఇవ్వడానికి ఎన్టీఆర్ తపించారు.
Also Read : ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?