DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Andhra Pradeh: ఏపీలో ఇరవై మంది డీఎస్పీలను బదిలీ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నా పట్టించుకోకపోవడమే కారణంగా భావిస్తున్నారు.
Twenty DSPs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు అయిన డీఎస్పీలలో జి. సీతారామా రావు, వీవీ అప్పా రావు, ఎన్. కాళిదాస్, చిట్టిబాబు, బి.రామకృష్ణ, సురేశ్ కుమార్ రెడ్డి, ఏబీజీ తిలక్, రవి కిరణ్, మల్లిఖార్జున రావు, శ్రీనివాస రెడ్డి, ఎండీ.మొయిన్, కే సీహెచ్ రామా రావు, విజయశేఖర్, కొంపల్లి వెంకటేశ్వర రావు, కే. రసూల్ సాహెబ్, సీహెచ్ వి రామా రావు, షన్ను షేక్, ఎన్. సురేశ్ బాబు, వాసుదేవన్, డి.లక్ష్మణరావు ఉన్నారు. కొంత మంది వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చారు. మరికొంత మందిని బదిలీ చేశారు.
కొంత మంది పోలీసులు ఇంకా వైసీపీ నేతలు చెప్పినట్లే వింటున్నారని గత వారం రోజులుగా టీడీపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. కుటుంబాలను కించ పరుస్తున్నా.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలోనూ కీలకంగా ఉన్న అధికారులే ఇలా చేస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో గీత దాటి మహిళలు, కుటుంబసభ్యులపై అరాచకంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని వారిపై బదిలీ వేటు వేసినట్లుగా తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో చట్ట ప్రకారం కాకుండా వైసీపీ నేతల కోసం పని చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీలను పెద్ద ఎత్తున పక్కన పెట్టారు. వారిలో చాలా మందికి ఇప్పటికీ పోస్టింగులు లేవు. అయితే తాజా బదిలీల్లో కొంత మందికి అవకాశం కల్పించారు. ఇంకా చాలా మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. ఇప్పుడు పోస్టింగ్‌లు ఇచ్చిన వారిలోనూ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటంతో ఇతరులకు గట్టి సిగ్నల్స్ పంపాలన్న లక్ష్యంతో బదిలీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ హయాంలో పోలీసింగ్ పూర్తిగా ఏకపక్షంగా ఉండేది. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పోలీసులు పని చేసేవారని టీడీపీ నేతలంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉందని టీడీపీ నేతలు, కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ క్యాడర్ రోజూ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తూనే ఉంది. తాజాగా పవన్ కల్యాణ్ అటు చంద్రబాబుతో పాటు ఇటు హోంమంత్రితో కూడా మాట్లాడారు. నెల రోజుల్లో మొత్తం సెట్ రైట్ చేస్తానని చంద్రబాబు హామీ ఇ్చచారు. అలా హామీ ఇచ్చిన వెంటనే.. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యరాతలు రాస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు నుంచి సీరియస్ గా ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.