NTR as Mahatma Gandhi : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ, స్వర్ణ పతకంతో సత్కారం!
రాజకీయాల్లో జవహర్ లాల్ నెహ్రూ వారసురాలు ఇందిరా గాంధీని ధీటుగా ఎదుర్కొన్న నాయకుడు ఎన్టీఆర్. కాలేజీ రోజుల్లో నెహ్రూ చేత బంగారు పతకం అందుకున్న ఘనత కూడా ఆయనదే.
భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప నాయకులలో జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ఒకరు. దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన సమరయోధుల్లో ఆయన ఒకరు. మన దేశ తొలి ప్రధాని కూడా ఆయనే. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం, గుర్తింపు తీసుకు వచ్చిన కథానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చిన నాయకుడు ఆయన (NTR).
తాను కాలేజీలో చదివే రోజుల్లోనే నెహ్రూకి నందమూరి తారక రామారావుగా ఎన్టీఆర్ పరిచయం అయ్యారు. అంతే కాదు... తన నటనతో నెహ్రూని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి, ఆయన చేత బంగారు పతకాన్ని బహుమతిగా అందుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే... ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే!
గుంటూరు ఎ.సి. కాలేజీలో...
గాంధీజీగా ఎన్టీఆర్ మారిన వేళలో!
అప్పటికి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు. తెల్లదొరలకు వ్యతిరేకంగా గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ వయోబేధం లేకుండా భారత ప్రజలు 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొంటున్న రోజులు అవి. అప్పుడు గుంటూరులోని ఎ.సి. కాలేజీలో ఓ వింత సంఘటన జరిగింది. అది ఏమిటంటే...
కాలేజీ పాలకవర్గం అంతా యూరోపియన్స్ వారిదే. అక్కడి విద్యార్థులు మాత్రం మన భారతీయులు. పాలకవర్గానికి, విద్యార్థులకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య శాంతియుత సమన్వయం కుదర్చడానికి గాంధీజీ అనుచరుడైన జవహర్ లాల్ నెహ్రూ ఆ కాలేజీకి వచ్చారు. ఆయన రాకతో భారీ సభ ఏర్పాటు చేశారు. వేదికపై నెహ్రూ ప్రసంగిస్తున్నారు.
నెహ్రూ భావోద్వేగ పూరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థులు సభలో ఉన్నారు. సూది పడితే వినపడేంత నిశ్శబ్దం చోటు చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో... విద్యార్థుల మధ్యలో నుంచి భుజాన కండువా, చేతికర్ర ఆసరాతో ఒకరు చకచకా నడుచుకుంటూ వేదిక వైపు అడుగులు వేస్తున్నారు. నెహ్రూ చూపు కూడా అటు పడింది. ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 'బాపూజీ! మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పైకి రండి...' అంటూ ఎదురువెళ్ళి సాదరంగా స్వాగతం పలికారు. నెహ్రూ సహా వేదిక కింద ఉన్న విద్యార్థులు సైతం కొన్ని నిమిషాల పాటు గాంధీజీ వచ్చారని భావించారు. ఒక్కటే అలజడి మొదలైంది. కాసేపటికి కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చింది నిజమైన గాంధీజీ కాదని గుర్తు పట్టారు.
''క్షమించాలి నెహ్రూజీ! మీరు స్వాగతం పలికిన వ్యక్తి నిజమైన గాంధీ కాదు. మా కాలేజిలో బీఏ చదువుతున్న విద్యార్థి. విచిత్ర వేషధారణ అంటే అతనికి ఎక్కువ మక్కువ'' అని నెహ్రూకి కాలేజీ ప్రిన్సిపాల్ వివరించారు. గాంధీజీగా నెహ్రూను సైతం నమ్మించిన ఆ విద్యార్థి నందమూరి తారక రామారావు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నటన అనేది సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన రక్తంలో ఉంది.
''మహాత్మా గాంధీజీ వేషంలో వచ్చి నన్ను కూడా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన ఇతని(ఎన్టీఆర్)కి స్వర్ణ పతకాన్ని బహుమానంగా ప్రకటిస్తున్నాను'' అని సభలో ప్రకటించిన నెహ్రూ... ఢిల్లీ వెళ్ళాక ఆ బంగారు పతకాన్ని పంపారు.
బహుశా నెహ్రూ అప్పుడు ఊహించి ఉండరు... గాంధీ వేషధారణలో తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విద్యార్థి, తన చేత బంగారు పతకం అందుకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన వారసురాలు ఇందిరా గాంధీకి ఎదురు నిలిచి ధీటైన నాయకుడు ఎన్టీఆర్ అవుతారని! రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని!