Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Andhra News: నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Rains Alert To AP And Telangana: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీ, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్యం దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. వర్షాలు కురిసే సమయంలో చెరువులు, పొలాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్లు, టవర్స్ కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.
మన్యంలో చలి ప్రభావం
అటు, విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి వణికిస్తోంది. ప్రతీ ఏడాది అక్టోబర్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడాది వాయుగుండాలు, అల్పపీడనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురవడం, సాయంత్రం 4 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది.
తెలంగాణలో..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ (Telangana) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది. కొద్ది రోజులుగా చలి తీవ్రత కూడా బాగా పెరగ్గా.. ఉదయం వేళల్లో మంచు కురుస్తోంది. ఈ నెల 11వ తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. 12 నుంచి 15వ తేదీ వరకూ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల నమోదు కానుందని పేర్కొంటున్నారు.