Shahrukh Khan: నా కోసం ‘పుష్ప‘ లాంటి స్క్రిప్ట్ రాస్తావా? ‘యానిమల్‘ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ బాద్షా రిక్వెస్ట్
తమిళ దర్శకుడితో ‘జవాన్‘ సినిమా చేసిన షారుఖ్ ఖాన్, తెలుగు దర్శకుడితో సినిమా చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టారు. తన కోసం ‘పుష్ప‘ లాంటి స్క్రిప్ట్ రాయాలంటూ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేశారు.
Shahrukh Khan Request To Sandeep Reddy Vanga: భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేడుకలో సౌత్ తో పాటు బాలీవుడ్ కు సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ‘జవాన్‘ చిత్రంలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన షారుఖ్ ఖాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన కోసం ‘పుష్ప‘ లాంటి స్క్రిప్ట్ రాయాలంటూ ‘యానిమల్‘ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కోరారు.
ఐఫా వేదిక నుంచి షారుఖ్ రిక్వెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోయింది. ఈ చిత్రంలో నటనకు గాను బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. తొలిసారి ఈ అవార్డు అందుకున్న టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ సైతం పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఫిదా అయ్యాడు. అంతే కాదు... నేరుగా ఐఫా వేదిక మీదుగా నాకోసం `పుష్ప` లాంటి సినిమా చేస్తావా? అంటూ ‘యానిమల్‘ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేశారు. ‘కబీర్ సింగ్‘, ‘యానిమల్‘ సినిమాలతో అద్భుత విజయాలను అందుకున్నారు సందీప్ రెడ్డి. ‘యానిమల్‘ సినిమాతో దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా షారుఖ్ సందీప్ ను తనతో సినిమా చేస్తావా? అని అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఆర్యన్ ఖాన్ అరెస్టు, గౌరీ ఖాన్ కు థ్యాంక్స్
అటు ‘జవాన్‘ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన తనకు సపోర్టు చేసిన సతీమణి గౌరీ ఖాన్ కు షారుఖ్ ధన్యవాదాలు చెప్పారు. భర్త కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ నవ్వారు. అటు డ్రగ్స్ కేసులో తన కొడుకు అరెస్టు కావడం పట్ల ఆయన స్పందించారు. తన జీవితంలో ఆ ఘటన చాలా బాధ పెట్టిందని వెల్లడించారు. ముంబైలో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్ పట్టుబడి నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు.
'ఊ అంటావా' సాంగ్ కు విక్కీ కౌశల్ తో డ్యాన్స్
ఐఫా అవార్డుల వేడుకలో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్టులుగా చేశారు. గెస్టులను అలరించేందుకు వీరిద్దరు మాస్ స్టెప్పులతో అలరించారు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప‘ సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ..‘ అనే పాటకు ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?