Sekhar kammula: లవ్ స్టోరీ రెడీ చేస్తోన్న శేఖర్ కమ్ముల - ఈసారి కొత్త యాక్టర్స్‌తోనేనా...
Sekhar Kammula New Project: శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో కొత్త నటీనటులను తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Sekhar Kammula Next Project With Love Story: ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన మూవీస్ అటు యూత్ నుంచి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ అందరినీ మెప్పిస్తాయి. సెన్సిటివ్ అంశాలను కూడా ఎలాంటి కాంట్రవర్శీస్ లేకుండా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తారు శేఖర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ 'కుబేర' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్... నానితో...
శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్టును నేచరల్ స్టార్ నానితో తీయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్టోరీ వినిపించగా నాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మించబోతున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే... ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో 'ప్యారడైజ్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కేందుకు చాలా టైం పడుతుంది.
లవ్ స్టోరీతో...
ఈ కారణంగా శేఖర్ కమ్ముల ఓ లవ్ స్టోరీని రెడీ చేసే పనిలో పడ్డారట. ఈ స్టోరీని ఇప్పటికే ఆయన ప్రారంభించారని... ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన కొత్తవారిని తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ మూవీతో పాటే నాని ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: భర్తకు దూరంగా స్టార్ హీరోయిన్ హన్సిక? - డివోర్స్ రూమర్స్‌పై క్లారిటీ ఇదే
'ఆనంద్' నుంచి 'కుబేర' వరకూ...
'డాలర్ డ్రీమ్స్' మూవీతో డైరెక్టర్‌గా ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు శేఖర్ కమ్ముల. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ మూవీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడం సహా జాతీయ అవార్డును అందుకుంది. రెండో చిత్రం 'ఆనంద్' మంచి కాఫీ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కు అందించింది. ఆ తర్వాత వచ్చిన 'గోదావరి' మూవీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అందమైన గోదావరిలో పాపికొండల విహార యాత్రతో పాటు ఓ అందమైన లవ్ స్టోరీని ఎమోషన్‌తో చూపించారు శేఖర్.
ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీడేస్' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ మూవీతో మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ హీరోస్ నిఖిల్, వరుణ్ సందేశ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్ మధ్య సరదాలు, లవ్, ఎమోషన్స్ అన్నింటినీ ఈ మూవీలో చూపించారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. పొలిటికల్ డ్రామా 'లీడర్'తో రానా ఎంట్రీ అదిరిపోగా రాజకీయ చదరంగంలో ఎత్తులు, అవినీతి అంశాలను టచ్ చేస్తూ అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా', 'లవ్ స్టోరీ', 'కుబేర' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు శేఖర్.






















