Martin Luther King Trailer: ఓటు విలువ తెలియజెప్పే 'మార్టిన్ లూథర్ కింగ్' - ఆసక్తికరంగా ట్రైలర్!
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ పొలిటికల్ కామెడీ డ్రామా 'మార్టిన్ లూథర్ కింగ్'. అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. ఇది తమిళ సూపర్ హిట్ మూవీ 'మండేలా' కు అధికారిక తెలుగు రీమేక్. 'కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే - మాటలు అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్స్ తో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ పొలిటికల్ సెటైరికల్ కామెడీ డ్రామా రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
'నా పళ్ళు చూసారు కదా.. చిన్నప్పుడు నన్ను అందరూ ఏనుగు దంతాలు అని పిలిచేవారు.. కానీ ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నానని ఈ మధ్య స్మైల్ అని పిలుస్తున్నారు' అని సంపూర్ణేష్ బాబు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. కనీసం తనని పేరు పెట్టి పిలవడానికి కూడా సొంతవాళ్ళు అంటూ ఎవరూ లేని అనాధగా, ఊర్లో ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికే అమాయడిగా సంపూర్ణేష్ కనిపిస్తున్నాడు. ఆ ఊర్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న శరణ్య ప్రదీప్ అతనికి 'మార్టిన్ లూథర్ కింగ్' అని నామకరణం చేస్తుంది.
అయితే ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడటంతో.. సీనియర్ నటుడు వీకే నరేష్, దర్శకుడు వెంకటేష్ మహా ఇద్దరూ అభ్యర్థులుగా పోటీలో నిలబడాలని ఫిక్స్ అయ్యారు. ఓటర్లను ఆకర్షించడానికి ఒకరు గోవా ట్రిప్ కి తీసుకెళ్తానని చెప్తుంటే.. ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు అకౌంట్ లో వేస్తానని మరొకరు హామీ ఇస్తున్నారు. జనాలకు డబ్బులు పంచుతూ, మాటలతో మభ్యపెడుతూ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రతిష్టాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్‌కు చోటు!
అయితే రెండు కులాల మధ్యన కొనసాగే ఈ ఎన్నికల సమరంలో మార్టిన్ లూథర్ కింగ్ ఓటు చాలా కీలకంగా మారుతుంది. ఇద్దరు అభ్యర్థులకు మద్దతుదారులు సమానంగా ఉండటంతో, గెలుపు కోసం అదనంగా ఒకరి సపోర్ట్ అవసరం అవసరమైంది. అందుకే తక్కువ కులానికి చెందిన సంపూర్ణేష్ మద్దతు కోసం అతన్ని ఆకట్టుకోడానికి సర్పంచ్ అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన మార్టిన్.. వారితో తన అవసరాలన్నీ తీర్చుకుంటున్నాడు. ఈ విషయం ఇరు వర్గాలకు తెలిసిన తర్వాత అతను ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఈ ట్రైలర్ లో చూపించారు. ఓటు విలువ తెలిసిన తర్వాత కింగ్ ఏం చేసారు? ఎవరికీ ఓటు వేసాడు? చివరకు ఎవరు సర్పంచ్ అయ్యారు? అనేది తెలియాలంటే 'మార్టిన్ లూథర్ కింగ్' సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ చూస్తుంటే, 'మండేలా' కథలో పెద్దగా మార్పులు చేయకుండా మన నేటివిటీకి తగ్గట్లుగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు తమ కులాలకు చెందిన ప్రజల మద్దతు కూడకట్టుకోడానికి మాటలతో మభ్యపెట్టడం, లెక్కలేనన్ని హామీలు ఇవ్వడం చూస్తుంటే.. ప్రస్తుత ఎన్నికల ప్రచారాలపై సెటైర్లు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకూ కామెడీ పాత్రల్లో అలరించిన సంపూర్ణేష్ బాబు.. ఈసారి తన ఇన్నోసెంట్ క్యారక్టర్ ద్వారా కామెడీ పండిస్తూనే, మరోవైపు తనలోని ఎమోషనల్ యాంగిల్ ను చూపించబోతున్నారు. 'ఫిదా' తర్వాత శరణ్య ప్రదీప్ కు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్ర లభించింది. వి.కె. నరేష్, వెంకటేష్ మహాలు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ నాలుగు పాత్రలు తప్ప పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ ఈ ట్రైలర్ లో కనిపించలేదు.
'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. దీనికి వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్. స్మరన్ సాయి సంగీతం సమకూర్చగా, దీపక్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ సినిమాని అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా సంపూర్ణేష్ బాబుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: 'ఫ్యామిలీ స్టార్'గా మారిపోయిన రౌడీ బాయ్ - టైటిల్ గ్లింప్స్ అదుర్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial