RRR Movie: 'ఆర్ఆర్ఆర్' చూడటానికి ఈ పది కారణాలు చాలా? ఇంకేమైనా కావాలా!?
Ten reasons to watch NTR Jr, Ram Charan, Rajamouli's RRR: 'ఆర్ఆర్ఆర్' కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. 'ఆర్ఆర్ఆర్' అంటే ఎందుకంత క్రేజ్? అంటే...
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'... ఇప్పటివరకూ సినిమాలో ఏముంది? అనేది ఒక రహస్యం. ఇకపై కాదు! ఎందుకంటే... కొన్ని గంటల్లో 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో ఏముందనేది బయటకు వస్తుంది. సస్పెన్స్, ట్విస్ట్స్ రివీల్ చేయవద్దని ఎంత చెప్పినా... సోషల్ మీడియాలో షేర్ చేసే జనాలు ఎలాగో ఉంటారు. బాలేదని చెప్పే జనాలూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే... తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. క్రేజ్ ఆకాశాన్ని అంటింది. టికెట్స్ దొరకడం లేదు. నాలుగైదు రోజుల వరకూ థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్' అంటే ఎందుకు ఇంత క్రేజ్? సినిమాను ఎందుకు చూడాలి? అంటే... ఇవిగో, ఈ పది కారణాలు ఉన్నాయిగా! ఇవి చాలా? ఇంకా కావాలా?
రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' అంటే ముందు గుర్తొచ్చే పేరు రాజమౌళి. అవును... ఇది రాజమౌళి సినిమా. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించినా... ఇది రాజమౌళి చిత్రమే. ఆయన దర్శకుడు కాబట్టే తామిద్దరం సినిమా చేశామని హీరోలు ఇద్దరూ చెప్పారు. ఇప్పటివరకూ అపజయం ఎదురని దర్శకుడు రాజమౌళి. తాను తీసిన తొలి సినిమా 'స్టూడెంట్ నంబర్ 1' అమెచ్యూర్ గా ఉంటుందని రాజమౌళి చెప్పినా... ఇప్పటివరకూ మాస్ ప్రేక్షకులను రాజమౌళి డిజప్పాయింట్ చేసిన సినిమా లేదు. మాస్ అంటే బి, సి సెంటర్ ఆడియన్స్ కాదు... మెజారిటీ ప్రేక్షకులు! సినిమాతో ప్రేక్షకుడు ఎమోషనల్ గా ట్రావెల్ చేయడంలోనూ, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ - ఫైట్స్ తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఆయన కోసం హ్యాపీగా 'ఆర్ఆర్ఆర్'కు వెళ్లొచ్చు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఆయన డిజప్పాయింట్ చేయలేదని అర్థమవుతోంది.
ఎన్టీఆర్ - రామ్ చరణ్
రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్'కు మరో స్పెషల్ అట్రాక్షన్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్. రాజమౌళి వాళ్ళిద్దరి కాంబినేషన్ తెరపైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వ్యూల్లోనూ ఆ స్నేహం కనిపించింది. అయితే... ఇరువురి అభిమానుల్లో, నందమూరి ఫ్యాన్స్, కొణిదెల ఫ్యాన్స్ మధ్య ఆ స్నేహం ఉందా? అంటే డౌటే. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఫ్యాన్ వార్స్ చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఎలా చేశారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అరుదైన మల్టీస్టారర్ సినిమా ఇది. దీని తర్వాత నందమూరి, కొణిదెల కుటుంబాల్లో యువ హీరోలు కలిసి సినిమా చేయవచ్చు. కానీ, 'ఆర్ఆర్ఆర్'కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది.
'బాహుబలి' తర్వాత రాజమౌళి తీసిన సినిమా
'బాహుబలి' రెండు భాగాలుగా విడుదలైంది. రెండూ భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'బాహుబలి 2' ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. అలాంటి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'.
కొమురం భీమ్ - అల్లూరి పాత్రలు
కథ కల్పితం కావచ్చు... క్యారెక్టర్లు కల్పితం కావచ్చు... కానీ పేర్లు అవే కదా! అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ను ప్రచార చిత్రాల్లో, యూట్యూబ్ లో చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. 70ఎంఎం స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్! ఆ పాత్రల్లో వాళ్ళిద్దరి చూడటం కోసమైనా సినిమాకు వెళ్లాలని అనుకుంటున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇక, పాత్రల విషయానికి వస్తే... రాజమౌళి ఎంత స్వేచ్ఛ తీసుకున్నారు? చారిత్రక పాత్రలను అలాగే చూపించారా? లేదా? ఫిక్షనల్ స్టోరీ అనేది ఒకే. కానీ, క్యారెక్టర్స్ సంగతి ఏంటి? సినిమా చూస్తే తెలుస్తుంది.
విజువల్స్ - భారీ బడ్జెట్!
తెలుగులో భారీ బడ్జెట్ చిత్రమిది. ఆ మాటకు వస్తే... బహుశా, ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమా కావచ్చు. బాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ ఎక్కువ ఉంటాయి. మేకింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. 'ఆర్ఆర్ఆర్' మేకింగ్ కాస్ట్ రూ. 335 కోట్లు. అంత ఖర్చు పెట్టారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. గ్రాండియర్ విజువల్స్ కోసం కూడా సినిమాకు వెళ్లొచ్చు. రాజమౌళి - కెకె సెంథిల్ కుమార్ కాంబినేషన్ అంటే గ్రాండ్ విజువల్స్ కు పెట్టింది పేరు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రమిది.
'సిరివెన్నెల' దోస్తీ - 'నాటు నాటు' సాంగ్!
ఒక సినిమా ఇచ్చే కిక్ 'నాటు నాటు' సాంగ్ ఇచ్చేలా ఉంది. మిగతా పాటల సంగతి ఎలా ఉన్నా... 'నాటు నాటు' సాంగ్ ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కేసింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ స్టెప్స్ వేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలదన్నట్టు ఉంది. ఇంకొకటి... 'సిరివెన్నెల' రాసిన 'దోస్తీ' సాంగ్. కథకు తగ్గట్టు, కథలో ఆత్మను ఆవిష్కరించేట్టు పాటలు రాయడం సిరివెన్నెల శైలి. 'జడివానకు, బడబాగ్నికి దోస్తీ' అంటూ ఒక్క లైనులో 'ఆర్ఆర్ఆర్' కథను చెప్పారు. 'పులికి - విలుకాడికి, తలకి - ఉరితాడికి' అంటూ పాట ప్రారంభించి సినిమాపై ఆసక్తి పెంచారు. 'నాటు నాటు' పాటకు థియేటర్లు దద్దరిల్లితే... 'దోస్తీ' పాటకు భావోద్వేగంతో కళ్లప్పగించి చూస్తారేమో! రాజమౌళి సినిమా అంటే కీరవాణి నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది. ఈ సినిమాలోనూ మాంచి నేపథ్య సంగీతం ఊహించవచ్చు.
ఆలియా భట్!
తెలుగు తెరకు ఆలియా భట్ పరిచయం అవుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రముఖ హిందీ హీరో అజయ్ దేవగన్ తొలి తెలుగు సినిమా కూడా ఇదే! విదేశీ భామ ఒలీవియా మోరిస్ తొలి భారతీయ చిత్రమిది. అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ... భారీ తారాగణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది.
పులితో ఎన్టీఆర్ ఫైట్!
పులితో ఎన్టీఆర్ ఫైట్ ఉందట! - సినిమా షూటింగ్ సమయంలో వినిపించిన మాట. పులికి ఎన్టీఆర్ ఎదురెళ్ళే షాట్ సూపర్ ఉంది! - ట్రైలర్ విడుదలైన తర్వాత వినిపించిన మాట. ఈ ఫైట్ ఎలా ఉంటుందో?
కన్నీళ్లు పెట్టించే ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫైట్!
పులితో ఎన్టీఆర్ ఫైట్ ఒక్కటేనా? ఎన్టీఆర్ - రామ్ చరణ్ మధ్య కూడా ఒక ఫైట్ ఉంది. అది ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టిస్తుందని యూనిట్ టాక్. ఈ రెండిటితో పాటు జనాల్ని రామ్ చరణ్ కొట్టే సీన్, గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ట్రైలర్‌లో ఎండింగ్ షాట్ - ప్రచార చిత్రాల్లో చూపించిన ప్రతి యాక్షన్ షాట్ ప్రేక్షకులకు నచ్చింది. అందులో యాక్షన్ సీన్స్ తీయడంలో రాజమౌళికి ఒక మార్క్ ఉంది. ఆ ఫైట్స్ కోసం వెళ్లే ఆడియన్స్ ఉన్నారు.
విజయేంద్రప్రసాద్ & ఎమోషన్!
'ఆర్ఆర్ఆర్' సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. అయితే... సినిమా విడుదల దగ్గర పడిన తర్వాత ప్రచారంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. రాజమౌళి సినిమాలకు ఆయన మంచి కథలు అందించారు. కొత్తదనం కంటే ప్రేక్షకులు కోరుకునే ఎమోషన్ ఇవ్వడం విజయేంద్ర ప్రసాద్ శైలి. యాక్షన్ మాత్రమే కాదు, ఆయన రాసిన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్ అవుతాయని చెప్పవచ్చు.