Rashmika: కుబేర విజయం: రష్మిక ఖాతాలో మరో హిట్, కానీ అభిమానులకు నిరాశ... కారణం ఏంటంటే?
Kuberaa: 'కుబేర' విజయం రష్మిక అభిమానులకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. అందులో ఆవిడ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

రష్మిక మందన్నా (Rashmika Mandanna) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నేషనల్ క్రష్ నటించిన తాజా సినిమా 'కుబేర' (Kuberaa) విమర్శకులతో పాటు ప్రేక్షకులు అందరినీ మెప్పించింది. ఈ సక్సెస్ ఆమె అభిమానులకు కూడా సంతోషాన్ని ఇచ్చింది అయితే ఒక్క విషయంలో మాత్రం వాళ్లు ఫీల్ అవుతున్నారు.
రష్మిక పాటకు కత్తెర వేసిన కమ్ముల!
'కుబేర' సినిమాలో సమీర పాత్రలో రష్మిక సందడి చేశారు. హీరోతో ప్రేమలో పడే రెగ్యులర్ రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు అది. దేవా (హీరో ధనుష్ పోషించిన బిచ్చగాడి పాత్ర)కు హెల్ప్ చేసే క్యారెక్టర్.
సమీరా పాత్రకు, అందులో రష్మిక నటనకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ప్రేమించిన అబ్బాయి రాజు కోసం ఇంటి నుంచి ముంబై వచ్చేసిన అమ్మాయి సమీర. ఆమె వస్తుంది కానీ ఆమె కోసం రాజు రాలేదు. రైల్వే స్టేషన్‌లో కూర్చుని బాధపడుతున్న సమయంలో దేవా కనపడతాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిన అతడికి సాయం చేస్తుంది. తనకు సాయం చేసిన వ్యక్తులను గుర్తు పెట్టుకునే దేవా... పదే పదే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. దేవా పరిచయం సమీరను మొదట మరిన్ని చిక్కుల్లోకి నెట్టేసినప్పటికీ... తర్వాత అతడిని అర్థం చేసుకుని సాయం చేస్తుంది.
రష్మిక పాత్రను బాగా డిజైన్ చేశారు శేఖర్ కమ్ముల. సీరియస్‌గా సాగే కథలో ఆవిడ క్యారెక్టర్ ప్రేక్షకులు అందరికీ రిలీఫ్ ఇచ్చింది. సమీరను బేస్ చేసుకుని శేఖర్ కమ్ముల రాసిన సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగా హిట్ అయింది. తన బాధను సమీర చెబుతుంటే ప్రేక్షకులు అందరికీ నవ్వు వస్తుంది. సమీర పాత్రలో రష్మిక జీవించారని చెప్పాలి. అయితే రష్మిక అభిమానులకు ఒక్క విషయంలో నిరాశ మిగిలింది.
Also Read: మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ నెల... హరిహర వీరమల్లుకు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
'కుబేర'లో రష్మిక మీద ఒక పాట తీశారు శేఖర్ కమ్ముల. 'పిప్పిప్పీ డుం డుం డుం' అంటూ సాకే ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు సూపర్ హిట్ అయింది. ముంబై హాస్టల్‌లో సమీర జాయిన్ అయిన సమయంలో తీసిన సాంగ్ అని లిరికల్ వీడియో చూస్తే అర్థం అవుతోంది. అయితే సినిమాలో ఆ సాంగ్ లేదు. నిడివి ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో పాటకు కత్తెర వేశారు శేఖర్ కమ్ముల. దాంతో నేషనల్ క్రష్ ఫ్యాన్స్ అంతా కాస్త ఫీల్ అయ్యారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించడంతో కొన్ని రోజుల్లో ఆ పాట యాడ్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ థియేటర్లలోకి పాట రాకపోయినా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
'యానిమల్', 'పుష్ప 2 ది రూల్', 'ఛావా' సినిమాలతో రష్మిక బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. అయితే సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'సికిందర్' సినిమా ఆవిడ విజయ పరంపరకు బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ 'కుబేర'తో సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు రష్మిక. మరోసారి తనది గోల్డెన్ లైగ్ ప్రూవ్ చేసుకున్నారు.




















