Ram Gopal Varma On Konda Surekha: రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి - 'కొండా' సురేఖ ఇష్యూలో వర్మ వెటకారం చేయడం లేదుగా?
కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరూ ట్వీట్లు చేశారు. అయితే, కొండా ఫ్యామిలీ మీద సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్లు చేయడం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అయ్యింది. అయితే... కొండా కుటుంబం మీద 'కొండా' సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఏం ట్వీట్ చేశారు? అనేది చూస్తే...
కొండా సురేఖ కామెంట్లకు షాక్ అయ్యాను!
''నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడం ఏ మాత్రం భరించకూడదు'' అని వర్మ తొలుత ట్వీట్ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు.
''కేటీఆర్ (KTR)ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థం ఏమిటో కనీసం ఆవిడకు అయినా అర్ధమయ్యుంటుందో, లేదో? నాకు అర్థం అవ్వడం లేదు! తనను రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారని, అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున - నాగ చైతన్యలను అంత కన్నా దారుణంగా అవమానించడం ఏమిటి?'' అని వర్మ ప్రశ్నించారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
''కింది స్థాయి గాసిప్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తాను ఏదో తన కన్నులతో చూసి, తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు (కొండా సురేఖ) అరచి చెప్పటం దారుణం'' అని వర్మ పేర్కొన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి గౌరవప్రదమైన కుటుంబాన్ని, సమంత లాంటి చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటి మీద అంత నీచమైన మాటలు అనడాన్ని తీవ్రంగా ఖండించాలని వర్మ అన్నారు.
Also Read: అటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఇటువంటివి మళ్లీ జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నామని వర్మ తన ట్వీట్ల పరంపరకు ముగింపు పలికారు. ఈ విషయంలో వర్మ స్పందించడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదీ ఈ స్థాయిలో ఆయన ట్వీట్లు చేయడంతో నిజమేనా? లేదంటే వర్మ ట్వీట్ల వెనుక వెటకారం ఏమైనా ఉందా? అని ఆలోచిస్తున్నారు. అదీ సంగతి!
మహిళగా మరొక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నించారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరూ ఆవిడ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ సైతం క్షమాపణలు చెప్పారు. తన పరిస్థితిలో మరొక మహిళ ఉండాలని అనుకోవడం లేదన్నారు. కొండా సురేఖ క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణుగుతుందని ఆశించవచ్చు.