Rahul Ravindran: చిన్మయి వల్ల తమిళంలో వర్క్స్ తగ్గాయి, ఆ విషయంపై మాట్లాడటం మానేశా - భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్
సింగర్ చిన్మయి లైంగిక వేధింపుల కేసు గురించి ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కీలక విషయాలు వెల్లడించారు. ఆమెకు జరిగిన దారుణాన్ని బయటపెట్టి ఎంతో మంది యువతులలో ధైర్యాన్ని నింపిందని చెప్పారు.
Rahul Ravindran About Singer Chinmayi Case: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి. వందలాది పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ బాగా పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్లకు తన గాత్రదానం చేసింది. #MeToo ఉద్యమం సమయంలో చిన్మయి తమిళ రచయిత వైరముత్తు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ప్రోగ్రామ్స్‌కు వెళ్లినప్పుడు ఆయన తనను వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం కలిగించాయి. చిన్మయితో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అతడు చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్ మీద దెబ్బ కొట్టాడని, ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని గతంలోనే సీఎం స్టాలిన్ కు కూడా చిన్మయి లేఖ రాశారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ ఆమెపై బ్యాన్ విధించింది.
తమిళ సీఎంపైనా చిన్మయి తీవ్ర ఆరోపణలు
ఓవైపు ఈ ఆరోపణల కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే గత ఏడాది వైరముత్తు రాసిన 'మహా కవితై' అనే పుస్తకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంపైనా చిన్మయి తీవ్రంగా స్పందించింది. “నన్ను లైంగికంగా వేధించిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు వేదికను పంచుకున్నారు. ఆయన నిజ స్వరూపం గురించి చెప్పిన నేను ఇండస్ట్రీ నుంచి నిషేధానికి గురయ్యాను. నా కెరీర్ ను కూడా కోల్పోయాను. నా కోరిక నెరవేరాలని కోరుకోవడం తప్ప, ప్రస్తుతానికి నేను చేసేది ఏమీ లేదు” అని చిన్మయి ట్వీట్ చేసింది. ఇప్పటికీ ఆయన తనకు చేసిన అన్యాయంపై న్యాయపరంగా కొట్లాడుతూనే ఉంది.
చిన్మయి పోరాటంపై భర్త రాహుల్ కీలక వ్యాఖ్యలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి భర్త రాహుల్, ఆమె న్యాయపోరాటం గురించి కీలక విషయాలు వెల్లడించారు. “వైరముత్తు మీద ఆరోపణలు చేసిన తర్వాత తమిళంలో తనకు వర్క్ చాలా తగ్గింది. అయినా, ఈ విషయంలో నేను తనకు పూర్తి మద్దతు చెప్తున్నాను. ఆమెకు చాలా ధైర్యం ఎక్కువ. నేను ఎమోషనల్ గా సపోర్టు చేస్తున్నాను అంతే. ఇంటికి వస్తే ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటున్నాను. అంతకు మించి నేను ఏమీ చేయట్లేదు. నేను ఈ విషయం గురించి మాట్లాడ్డం కూడా మానేశాను. ఇందులో నాకు ఏదో క్రెడిట్ ఇస్తున్నట్లు ఫీలవుతున్నారు. కానీ, ఆమె గురించి ఆమె కొట్లాడుతోంది. చిన్మయి ఈ విషయాన్ని బయట పెట్టాక నాకో విషయం తెలిసింది. నాకు తెలిసి అమ్మాయిలలో ఇలాంటి అనుభవాలను ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొన్నారు. ఇలాంటి విషయాల గురించి బయట మాట్లాడకూడదు. మాట్లాడితే మీ పరువే పోతది అనేలా చుట్టు పక్కవాళ్లు వ్యవహరిస్తుంటారు. మాట్లాడితే మనమే ఏదో తప్పు చేశాం అన్నట్లు చూస్తున్నారు. చిన్మయి మాట్లాడ్డం వల్ల చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. ఈ కేసు విషయంలో ఆమెకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను” అన్నారు.
Read Also: వింత వ్యాధితో బాధపడుతున్న సుహాస్, ముఖాలు గుర్తుపట్టలేడట - ఇంట్రెస్టింగ్‌గా ‘ప్రసన్నవదనం’ టీజర్