Prabhas - Prashanth Varma: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీ కన్ఫర్మ్... ఈ రోజే టెస్ట్ షూట్, లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Prabhas Prashanth Varma: రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ కాంబోలో రావలసిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ప్రచారం జరుగుతోంది.

'హనుమాన్' సూపర్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) వరస ఆఫర్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నట సింహం నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారని చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. తాజా అప్డేట్ ప్రకారం... మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పక్కన పెట్టి, రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీకి ప్రశాంత్ వర్మ సిద్ధమవుతున్నారు.
'బ్రహ్మ రాక్షస'లో ప్రభాస్... ఇవాళే టెస్ట్ షూట్!
ప్రశాంత్ వర్మ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ కు 'బ్రహ్మ రాక్షస' అనే సినిమా స్క్రిప్ట్ ను వివరించిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా పలు కారణాల వల్ల రణవీర్ సింగ్ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో, ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ 'బ్రహ్మ రాక్షస' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ టెస్ట్ లుక్ ఈ రోజు (ఫిబ్రవరి 26, బుధవారం) ప్లాన్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు కాబోతోంది? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ 'స్పిరిట్' తరువాత, అనుకున్నదాని కంటే ముందే మొదలు కాబోతోందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలు ఉన్నాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా ఆయన 'సలార్' ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారు. అందులో 'సలార్ 2'తో పాటు ప్రశాంత్ వర్మ సినిమా, మరొక సినిమా ఉన్నాయి. ఇంకో సినిమాకు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
మారిన ప్రభాస్ లైనప్
ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాల లైనప్ మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న'ది రాజా సాబ్', సినిమాతో పాటు ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే 'స్పిరిట్'ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రభాస్ - ప్రశాంత్ వర్మ మూవీని సెట్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ చేయాల్సిన మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ట్ కావడానికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంటే ముందే ప్రభాస్ తో మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
మోక్షు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ప్రశాంత్ వర్మ?
చాలా రోజుల నుంచి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ లాంచ్ బాధ్యతలను తలకెత్తుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. గత ఏడాది ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం పూజా కార్యక్రమాల దాకా వచ్చి ఆగిపోయిన మోక్ష ప్రాజెక్టు నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టేనని టాక్ నడుస్తోంది. ఆయన అఫీషియల్ గా ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్టు మీదకు వెళ్ళిపోతున్నట్టు సమాచారం. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నిర్మాత విషయానికి వస్తే... మోక్షు ప్రాజెక్టుకు బదులు నిర్మాత సుధాకర్ చెరుకూరికి గోపీచంద్ మలినేని - బాలకృష్ణ ప్రాజెక్ట్ ను అప్పగించబోతున్నారని అంటున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు అయోమయంగా మారింది.




















