Tatineni Rama Rao: ఎన్టీఆర్ 'యమగోల' దర్శకుడు తాతినేని రామారావు మృతి
సీనియర్ దర్శకులు, హిందీలోనూ సినిమాలు తీసిన తెలుగు డైరెక్టర్ తాతినేని రామారావు ఇకలేరు. చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (Tatineni Rama Rao Is No More) ఇక లేరు. మంగళవారం అర్ధరాత్రి చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఎవరో తెలియకపోవచ్చు. కానీ, తెలుగులో ఆయన సూపర్ హిట్ సినిమాలు తీశారు. హిందీలోనూ దర్శకుడిగా విజయాలు అందుకున్నారు.
ఎన్టీఆర్ 'యమగోల' (NTR's Yamagola Movie), ఏయన్నార్ 'బ్రహ్మచారి' (ANR's Brahmachari movie), శోభన్ బాబు 'జీవన తరంగాలు' (Shobhan Babu's Jeevana Tarangalu Movie) తదితర విజయవంతమైన చిత్రాలకు తాతినేని రామారావు (Tatineni Rama Rao) దర్శకత్వం వహించారు. 'లోక్ - పరలోక్' సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమైన ఆయన, ఆ తర్వాత తెలుగులో విజయవంతమైన పలు సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'యమగోల' అని చెప్పాలి.
తాతినేని రామారావు (Director T Rama Rao) స్వస్థలం కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరం. నవంబర్ 10, 1938న ఆయన జన్మించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశ్ రావు (Tatineni Prakash rao)కు రామారావు కజిన్. ప్రకాశ్ రావుతో పాటు ఆయన తీసిన సినిమాలు చూసి పరిశ్రమపై రామారావుకు ఆసక్తి పెరిగింది. కజిన్ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. తర్వాత కె. ప్రత్యగాత్మ దగ్గర కొన్ని చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పని చేశారు.
'నవరాత్రి' సినిమా (Tatinani Rama Rao First Movie As Director) తో తాతినేని రామారావు దర్శకుడిగా పరిచయమయ్యారు. అది తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ వందో సినిమా 'నవరాత్రి'కి రీమేక్. శివాజీ గణేశన్ పాత్రను తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. తమిళ సినిమాలో కథానాయికగా నటించిన సావిత్రి, తెలుగులోనూ నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా సరే... తాతినేని రామారావు ప్రతిభపై నమ్మకం ఉంచిన నిర్మాత ఏవీ సుబ్బారావు, ఏయన్నార్‌తో మరో సినిమా 'బ్రహ్మచారి' తీసే అవకాశం ఇచ్చారు. అది విజయం సాధించింది. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా 'మంచి మిత్రులు', ఏయన్నార్ హీరోగా 'రైతు కుటుంబం', 'దొరబాబు', 'ఆలుమగలు', 'శ్రీరామరక్ష', శోభన్ బాబుతో 'జీవన తరంగాలు', 'ఇల్లాలు' తదితర చిత్రాలు తీశారు. ఇవన్నీ ఒక ఎత్తు... ఎన్టీఆర్ 'యమగోల' మరో ఎత్తు.
'యమగోల' దర్శకుడు
తాతినేని రామారావు కెరీర్‌లో 'యమగోల' బిగ్గెస్ట్ హిట్ (Yamagola Direcor Tatineni Rama Rao). 'యమగోల' దర్శకుడిగా ఆయనకు ఎనలేని పేరు వచ్చింది. ఆ సినిమా హిందీ రీమేక్ 'లోక్ - పరలోక్'కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అదీ విజయం సాధించింది. అప్పటి నుంచి హిందీలో అవకాశాలు రావడం మొదలైంది. తెలుగులో తాను దర్శకత్వం వహించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం ప్రారంభించారు తాతినేని రామారావు. మరికొన్ని సినిమాలనూ రీమేక్ చేశారు. అలాగే, హిందీలో విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా 'యమగోల', 'అనురాగ దేవత', 'ఆటగాడు' సినిమాలు తీశారు. మూడూ వంద రోజులు ఆడాయి. 'అనురాగ దేవత' సినిమాతో పరుచూరి సోదరులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది తాతినేని రామారావే.
Also Read: ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ మృతి
హిందీలో అమితాబ్ బచ్చన హీరోగా...
అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'అంధా కానూన్', 'ఇంక్విలాబ్', 'ఆఖ్రీ రాస్తా' చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. (Amitabh Bachchan's Andha Kanoon Director Tatineni Rama Rao Is No More) తెలుగు హిట్ 'చట్టానికి కళ్లులేవు' సినిమాకు 'అంధా కానూన్' రీమేక్. అందులో రజనీకాంత్ కూడా నటించారు. 'పెదరాయుడు' సినిమాను హిందీలో 'బులందీ' రీమేక్ చేశారు. దర్శకుడిగా తాతినేని రామారావు ఆఖరి సినిమా గోవింద హీరోగా నటించిన 'బేటీ నంబర్ వన్' (Tatineni Rama Rao Last Movie As Director). రెండు దశాబ్దాలుగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్, సంతోషంలో కిచ్లూ - అగర్వాల్ ఫ్యామిలీ