Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ డైలాగ్‌పై తమిళ తంబీలు ఆగ్రహం - స్పందించిన నితిన్
Extra Ordinary Man dialogue: నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగా.. ఇందులోని ఒక డైలాగ్.. తమిళ ఆడియన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది.
Extra Ordinary Man Movie: సౌత్ సినిమాలు అన్నీ ఒకటే అన్నట్టుగా కలిసిమెలిసి ఉన్నా.. ఏదో ఒక చిన్న విషయం.. పెద్దగా మారి టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అనే గొడవ మొదలవుతుంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. తెలుగు వర్సెస్ తమిళ సినిమా అనే గొడవ ఎప్పటినుండో ఇండస్ట్రీలో నడుస్తోంది. అలా అని ఒక పరిశ్రమను మరో పరిశ్రమ అసలు ప్రోత్సహించదు అని కాదు.. ప్రోత్సహించే సమయంలో ప్రోత్సహించడం, గొడవపడే సమయంలో గొడవపడడం టాలీవుడ్, కోలీవుడ్‌లకు అలవాటే. తాజాగా నితిన్ నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలోని ఒక డైలాగ్ తమిళ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో మూవీ టీమ్ అంతా దీని గురించి వివరించడానికి ముందుకొచ్చింది.
సీరియస్‌గా మారిన ఫన్నీ డైలాగ్..
నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమానే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది టీమ్. అందులో భాగంగానే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో హీరో నితిన్‌కు తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించగా.. వీరిద్దరి మధ్య జరిగే గొడవల వల్ల మంచి కామెడీ జనరేట్ అయినట్టు అర్థమవుతోంది. ఇక తాజాగా విడుదలయిన ట్రైలర్‌లో కూడా నితిన్.. రావు రమేశ్‌తో కామెడీగా అన్న డైలాగ్ ఒకటి.. తమిళ ఆడియన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో దీని వల్ల గొడవ మొదలయ్యింది.
ఆ డైలాగ్ వల్లే..
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్‌లో నితిన్.. తన తండ్రి చెప్పేది ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలాగా ఉంటుందని, ఏమీ అర్థం కాదని అంటాడు. అంటే ‘పొన్నియిన్ సెల్వన్’ ఎవరికీ అర్థం కాలేదని మీ ఉద్దేశమా అంటూ మణిరత్నం ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వారితో పాటు కోలీవుడ్‌లోనే ‘పొన్నియిన్ సెల్వన్’ను చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రేక్షకులంతా కూడా ఈ డైలాగ్‌ను ఖండిస్తున్నారు. దీంతో ముందుగా నితిన్.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ‘‘మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ చూస్తేనే పొన్నియిన్ సెల్వన్ అర్థమవుతుంది. అందులో చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజర్ ఏర్పడే ఛాన్స్ ఉంది’’ అని క్లారిటీ ఇచ్చాడు.
కొన్ని సినిమాలు అంతే..
దర్శకుడు వక్కంతం వంశీ కూడా ‘పొన్నియిన్ సెల్వన్’ డైలాగ్ కాంట్రవర్సీపై స్పందించాడు. ఇది ప్రేక్షకులు నెగిటివ్‌గా అర్థం చేసుకుంటున్నారు కానీ ఇది ఒక పాజిటివ్ డైలాగ్ అని అన్నారు. ఇక ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నితిన్‌కు జోడీగా నటించిన శ్రీలీల కూడా ఈ విషయంపై మాట్లాడింది. ‘‘మామూలుగా కొన్ని సినిమాలు పలుమార్లు చూస్తే తప్పా మనకు అర్థంకావు’’ అంటూ ‘పొన్నియిన్ సెల్వన్’ అనేది అలాంటి సినిమా అని చెప్పుకొచ్చింది. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ‘యానిమల్’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో పోటీపడి మరీ.. ఈ శుక్రవారమే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకోవడం సాహసమే అని పలువురు ప్రేక్షకులు భావిస్తున్నారు.