NC 23: శ్రీకాకుళంలో నాగచైతన్య టీమ్ - ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోలో చూడండి
నాగచైతన్య తన కెరీర్‌లో 23వ చిత్రంలో మత్స్యకారుడిగా నటించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటీ తెరకెక్కిస్తున్నాడు.
అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రం (ఎన్‌సీ 23)లో ఒక మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల దగ్గరకు వెళ్లి మూవీ టీమ్ అంతా వారిని కలిసింది. వారి జీవితాలు ఎలా ఉంటాయనే విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో గడిపారు. దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ వీడియోను మూవీ టీమ్ తాజా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఎన్‌సీ 23 డిఫరెంట్ అంతే..
నాగచైతన్య తన కెరీర్‌లో 23వ చిత్రంలో మత్స్యకారుడిగా నటించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటీ తెరకెక్కిస్తున్నాడు. బన్నీ వాస్ దీనిని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్యతో పాటు మేకర్స్ అందరూ ఈ మూవీపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం శ్రీకాకుళం వెళ్లారు. మూవీ టీమ్ చేస్తున్న ప్రిపరేషన్ చూస్తుంటే సినిమా భారీ బడ్జెట్‌లో, భారీ స్కేల్‌తో తెరకెక్కనుందని సమాచారం. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని టీమ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తోంది.
హైదరాబాద్‌లో కూర్చుంటే వర్కవుట్ అవ్వదు..
ఏ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఇలాంటి ఒక వినూత్న ప్రయత్నం చేయలేదని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్‌సీ 23 ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం శ్రీకాకుళంలోని కె మచిలేశం అనే గ్రామాన్ని సందర్శించింది మూవీ టీమ్. ఇలాంటి ప్రయత్నం చేయడంపై నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో కూర్చొని ఈ స్టోరీని వర్కవుట్ చేయలేమని డైరెక్టర్ భావించాడు. ఇక్కడ ఉన్న మనుషులను, వాతావరణాన్ని స్టడీ చేస్తూ మేము ఈ ప్రీ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళుతున్నాం’’ అన్నారు. ఇక చందు మొండేటీ కూడా తాము ఆ గ్రామానికి వెళ్లి ప్రతీ చిన్న అంశాన్ని స్పష్టంగా పరీక్షించడం మొదలుపెట్టిన తర్వాతే తమ ప్రీ ప్రొడక్షన్ మొదలయ్యిందంటూ తెలిపాడు.
అనుభవాలతో డాక్యుమెంటరీ..
తాము తెరపై చూపించే క్యారెక్టర్ల కోసం అక్కడికి వెళ్లామంటూ నాగచైతన్య స్పందించాడు. వారి బాడీ లాంగ్వేజ్, గ్రామాలు, అందులో వారి లైఫ్‌స్టైల్.. ఇదంతా స్పష్టంగా చూశాం అని అన్నాడు. అంతే కాకుండా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల గురించి నాగచైతన్య స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఎన్‌సీ23 ప్రయాణంలో శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారులను, వారి కుటుంబాలను కలవడం కొత్త అనుభూతిని ఇచ్చింది. వారిని అనుభవాలను విన్నాం. ఇదంతా అర్థం చేసుకోవడంతో ఎన్‌సీ23లో నా క్యారెక్టర్‌ను మరింత కరెక్ట్‌గా బిల్డ్ చేసుకుంటాను’ అని ట్వీట్ చేశాడు నాగచైతన్య. కేవలం మత్స్యకారులతో మాట్లాడడం మాత్రమే కాకుండా ఎన్‌సీ23 టీమ్ సముద్రంలోకి కూడా వెళ్లింది. ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ‘ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్’ పేరుతో ఒక డాక్యుమెంటరీగా తయారు చేశారు. ఈ డాక్యుమెంటరీలో వారి అనుభవాలను కళ్లకు కట్టినట్టుగా చూపించింది ఎన్‌సీ23 టీమ్.
Also Read: తెలుగులో మాట్లాడిన హాలీవుడ్ ‘వండర్ ఉమెన్’ నటి - ఆలియాకు థాంక్స్ చెబుతోన్న ఫ్యాన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial