నారా రోహిత్ 'ప్రతినిధి' షూటింగ్ స్టార్ట్ - రిలీజ్ ఎప్పుడంటే?
నారా రోహిత్ హీరోగా 'ప్రతినిధి' సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాన్సెప్ట్ పోస్టర్తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ సోమవారం రోజున లాంచనంగా షూటింగ్ ప్రారంభించుకుంది.
టాలీవుడ్ లో 'బాణం', 'సోలో', 'అసుర', 'రౌడీ ఫెలో', 'ప్రతినిధి' లాంటి కంటెంట్ పోరియెంటెడ్ సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. వైవిధ్యమైన సినిమాలు చేసినా కూడా జనాల్లో ఇతని పేరు ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. ఫిజిక్ పై దృష్టి పెట్టలేకనో, కెరియర్ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడం వల్లనో సినిమాలకు దూరమయ్యాడు. నారా రోహిత్ నుంచి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. చివరగా ఐదేళ్ల కింద వచ్చిన 'వీర భోగ వసంత రాయలు' సినిమాలో కనిపించాడు ఈ నారా వారబ్బాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ కెమెరా ముందు కనిపించలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 9 ఏళ్ల కిందట నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం(ఆగస్టు 28) రోజు హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం హీరో నారా రోహిత్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్క్రిప్ట్ లో ఉన్న 60వ సీన్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాప్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం బిగ్ స్పాన్ ఉన్న కథను నారా రోహిత్ ఎంచుకున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిపబ్లిక్ డే కి ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 25, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ళ రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చెమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజల ఎడిటర్ గా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో 'ప్రతినిధి' మూవీ కూడా ఒకటిగా నిలిచింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ బుల్లితెరపై మాత్రం సంచలనాల సృష్టించింది. సినిమాలో ఓ కామన్ మ్యాన్ గా నారా రోహిత్ నటన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే ఒక సామాన్య వ్యక్తి పాత్రలో నారా రోహిత్ అదరగొట్టాడు.
దీంతో ఇదే సినిమా సీక్వెల్ తో ఇప్పుడు నారా రోహిత్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడం ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ రేంజ్ లో సీక్వెల్ ఉంటే కనుక కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి నారా రోహిత్ కి మంచి కం బ్యాక్ ఇస్తుందని చెప్పొచ్చు. కాగా నారా రోహిత్ చిత్ర షూటింగ్ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా.." 16,32,96,000 సెకన్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినట్లు" చెబుతూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ పోస్ట్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
16,32,96,000 seconds
— Rohith Nara (@IamRohithNara) August 28, 2023
BACK ON TRACK #Pratinidhi2 pic.twitter.com/77EZ47Kmmv
Also Read : అనుష్కతో కలిసి నటిస్తానని చిన్నప్పుడే కల వచ్చింది - అది ఇప్పుడు నిజమైంది: నవీన్ పొలిశెట్టి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial