Custody Trailer: ‘కస్టడీ’ ట్రైలర్ టాక్ - పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు లేని ఆ బాధ్యత ఆ కానిస్టేబుల్‌కే ఎందుకు?
అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కస్టడీ' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై వేదికగా విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, గార్జియస్ బ్యూటీ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు తమిళ భాషల్లో ఈ బైలింగ్వల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు, టీజర్.. అన్నీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సినిమాపై ఆసక్తిని కలిగించాయి. రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
సీఎం సెక్యూరిటీగా వెళ్లిన కానిస్టేబుల్ శివ (నాగచైతన్య) ఏకంగా రాష్ట ముఖ్యమంత్రి కన్వావ్ నే ఆపాడని పైఅధికారి వార్నింగ్ ఇవ్వడంతో 'కస్టడీ' ట్రెయిలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఉ్కంఠభరితంగా సాగిన ఈ రెండున్నర నిమిషాల పవర్ ప్యాక్డ్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.
నిజం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్, కస్టడీలో ఉన్న ఓ హార్డ్ కోర్ క్రిమినల్ ను కాపాడమే ఈ సినిమా కథ అని ట్రైలర్ చెబుతూనే ఉంది. ఇది 48 గంటల్లో జరిగే స్టోరీ అని దర్శక హీరోలు ఇప్పటికే చెప్పారు. లేటెస్టుగా వదిలిన ట్రైలర్ తో సినిమా కథ, నేపథ్యం గురించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మూవీలో మల్టిపుల్ లేయర్లు వున్నట్లు స్పష్టం చేస్తూ, సీన్స్ ఎక్కడా రిపీట్ చేయకుండా చాలా బాగా ట్రైలర్ ని కట్ చేశారు.
ఇప్పటి వరకూ తెలుగులో రాని, విలన్ ను కాపాడే హీరో అనే పాయింట్ ని కస్టడీలో హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు ఇష్టం లేని పెళ్లి చేసుకోబోతున్న ప్రేయసి.. మరోవైపు తాను రక్షించాల్సిన విలన్.. ఈ రెండిటినీ ట్రెయిలర్ లో బ్యాలన్స్ చేస్తూ వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లేతో నడిపించారని అర్థమవుతుంది. అయితే ఆ విలన్ ను ఎవరు చంపాలని అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు, పోలీసులు అతని వెంట ఎందుకు పడుతున్నారు? అతని వెనక దాగి వున్న అసలు నిజం ఏంటి? పోలీసు కానిస్టేబుల్ క్రిమినల్ ను కాపాడాడా లేదా? అనేది ఆసక్తికరం.
ఇందులో సీఎంగా ప్రియమణి నటిస్తుండగా, రాజు అనే కరడుకట్టిన క్రిమినల్ రాజుగా సీనియర్ నటుడు అరవింద్ స్వామి కనిపించాడు. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ గా నాగ చైతన్య సటిల్డ్ పెర్ ఫార్మెన్స్ అందించాడు. ఇది అతనికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. చై లుక్ కూడా తన పాత్రకు తగ్గట్లుగా చాలా కొత్తగా వుంది. అతని ప్రేయసి రేవతిగా కృతి శెట్టి ఆకట్టుకుంది. శరత్ కుమార్, సూర్య, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తెలుగమ్మాయి ఆనంది కూడా ఓ కీలక పాత్రలో నటించినట్లు హింట్ ఇచ్చారు.
ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సమకూర్చిన బ్యాగ్రౌండ్ కస్టడీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. SR కథిర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ తగట్టుగా బాగుంది. రాజీవన్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా, వెంకట్ రాజన్ ఎడిటర్ గా వర్క్ చేశారు. సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువే అని ట్రైలర్ తోనే చెప్పారు. అబ్బూరి రవి 'నిజం గెలవడానికి లేట్ అవుతుంది కానీ, కచ్ఛితంగా గెలుస్తుంది' 'ఒక్కసారి న్యాయం పక్కన నిలబడి చూడు, నీ లైపే మారిపోతుంది' వంటి డైలాగ్స్ అందించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.
కస్టడీ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది నాగచైతన్య కెరీర్ లోనే భారీ ఖర్చుతో తెరకెక్కిన మూవీ. అలానే చైతూకి తమిళ్ డెబ్యూ.. వెంకట్ ప్రభుకి తెలుగు డెబ్యూ. మే 12వ తేదీన తెలుగు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Read Also: అసత్య వార్తలపై శరత్ బాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం, కేసు పెడతామని హెచ్చరిక