పబ్లిసిటీతో పనేముంది? సైలెంట్‌గా వచ్చి సెన్సేషనల్‌గా నిలిచిన చిత్రాలివే!
ఇటీవల కాలంలో పలు సినిమాలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. పఠాన్ నుంచి కార్తికేయ-2 వరకూ ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం!
ఎంత పెద్ద హీరో నటించిన సినిమా అయినా.. కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి తీసిన మూవీ అయినా సరే.. దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేయకపోతే ఫలితం దక్కదనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. అందుకే తాము ఎలాంటి చిత్రంతో రాబోతున్నామనే విషయాన్ని ప్రమోషన్స్ ద్వారా తెలియజెప్పాల్సిన అవసరం వుంది. ఆ విధంగా చేస్తేనే ఆడియన్స్ థియేటర్ల వరకూ వస్తారు.
అందులోనూ ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్లకు రప్పించడం ఈరోజుల్లో ఫిలిం మేకర్స్ కు పెద్ద సవాలుగా మారిపోయిందని చెప్పాలి. దీని కోసం మేకర్స్ వివిధ మార్గాల్లో, గతంలో కంటే ఇంకాస్త ఎక్కువగానే పబ్లిసిటీ చేయాల్సి వస్తోంది. రిలీజ్ కు ముందూ, రిలీజ్ తర్వాత కూడా హడావిడి చేయాల్సి వస్తుంది. అయితే ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది భారీ బడ్జెట్, ప్రమోషన్స్ కాదు.. ఇక్కడ కంటెంట్ మాత్రమే ప్రధానం.
విపరీతంగా పబ్లిసిటీ చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా మారడం మనం చూశాం. చాలా తక్కువ బడ్జెట్ తో తీసి, ఎలాంటి పబ్లిసిటీ చేయని సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేయడమూ చూస్తున్నాం. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ మధ్య కాలంలో ఎలాంటి పబ్లిసిటీ చేయకుండా, సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిన్న, పెద్ద సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
కాంతారా
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా 'కాంతారా'. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. తెలుగులో రూ.65 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిజానికి విడుదలకు ముందు ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం చేయలేదు. మౌత్ టాక్ తోనే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. కన్నడ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాతే, తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ క్రమంలోనే పలు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ ఈ చిత్రాన్ని, తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు.
KGF
‘కాంతారా’ కంటే ముందు శాండిల్ వుడ్ నుంచి 'కేజీఎఫ్: చాప్టర్-1' సినిమా సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో 'కేజేఎఫ్ చాప్టర్-2' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే హైప్ తో రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో చేరింది.
'కార్తికేయ 2'
2022లో ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో 'కార్తికేయ 2' కూడా ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. కృష్ణతత్వం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా నార్త్ లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై, భారీ వసూళ్లను సాధించింది.
పఠాన్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా నటించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో టీజర్, ట్రెయిలర్, సాంగ్స్ రిలీజ్ చేయడం మినహా.. పబ్లిసిటీ చేయలేదు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
పుష్ప
తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'పుష్ప: ది రైజ్' సినిమా.. హిందీలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. నిజానికి హిందీలో ఈ చిత్రం కోసం ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అసలు నార్త్ లో థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషం వరకూ క్లారిటీ లేదు. విడుదలకు ముందు రోజు టీం ముంబైలో ప్రెస్ మీట్ పెట్టడం తప్ప, మరే ఇతర కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా సరే బాలీవుడ్ లో 'పుష్ప 1' తగ్గేదెలే అంటూ దూసుకుపోయింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ డైరెక్షన్ కు ఉత్తరాది జనాలు ఫిదా అయ్యారని చెప్పాలి.
'ది కాశ్మీర్ ఫైల్స్'
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్ళు రాబట్టింది. ప్రమోషన్స్ చేయకుండా సైలెంట్ గా వచ్చి, బాక్సాఫీస్ ను ఊపేసింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ.. రూ. 344.2 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది.
'జయ జయ జయ జయహే'
మలయాళంలో రిలీజైన 'జయ జయ జయ జయహే' అనే చిన్న చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5-6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. పెద్దగా ప్రచారం చేయలేదు. అయినప్పటికీ రూ.40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
'తూ జూతీ మై మక్కార్'
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన TJMM చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నిజానికి ఈ సినిమా కోసం టీమ్ ప్రమోషన్స్ చేయలేదు. మేకర్స్ 'పఠాన్' స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. అయినా సరే విజయం వరించింది. ఇలా ఇటీవల కాలంలో పలు చిత్రాలు పబ్లిసిటీ లేకుండానే ప్రజాదరణ పొందాయి. మౌత్ టాక్ తోనే జనాల్లోకి వెళ్ళాయని చెప్పాలి.
Read Also: 39వ వసంతంలోకి రామ్ చరణ్, #RC15 సెట్స్ లో ఘనంగా బర్త్ డే వేడుకలు