Footfalls Telugu Films: మాయాబజార్ To ఆర్ఆర్ఆర్ - వసూళ్లే కాదు, వీక్షకులూ ఎక్కువే - ఏయే మూవీని ఎంతమంది చూశారంటే..
తెలుగు సినిమా రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది. ‘RRR‘ సినిమా అంతర్జాతీయ స్థాయి సినీ అవార్డులను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ అనే పరిస్థితి ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీని సౌత్ ఇండస్ట్రీ డామినేట్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో అత్యధిక వీక్షించిన తెలుగు సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..
1. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు. ఒక సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించవచ్చని నిరూపించారు. బాహుబలి కుమారుడైన శివ తన వారసత్వం గురించి తెలుసుకోవడం, తనకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలు పెడతాడు. అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలి, తన తండ్రి చావుకు కారణమైన భల్లాల దేవుడిని చంపి మాహిష్మతి సామ్రాజ్యాన్ని దక్కించుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 10.82 కోట్లు.
2. బాహుబలి: ది బిగినింగ్ (2015)
మాహిష్మతి రాజ్యంలో సింహాసం కోసం పోటీ పడే ఇద్దరు యోధుల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు దర్శకుడు రాజమౌళి. సింహాసనం కోసం అన్యాయంగా అమరేంద్ర బాహుబలిని భల్లాల దేవుడు ఎలా చంపించాడు అనేది ఈ సినిమా కథ. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 4.9 కోట్లు.
3. RRR (2022)
రాజమౌళి తెరకెక్కించిన మరో ప్రపంచ స్థాయి సినిమా ‘RRR’. 1920లో దేశంలో కోసం పోరాడిన ఇద్దరు విప్లవ వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలతో కల్పిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1200 కోట్లు సాధించింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంటోంది. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 4.43 కోట్లు.
4. మగధీర (2009)
యువరాణిని ప్రేమించి రాజ్యం కోసం తన ప్రేమను వదులుకున్న ఓ యోధుడు 400 సంవత్సరాల తరువాత, పునర్జన్మ పొందుతాడు. మరు జన్మలోనూ అప్పుటి తన శత్రువును సంహరించి తన ప్రేమను తిరిగి పొందుతాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 2.8 కోట్లు.
5. లవ కుశ (I) (1963)
ఈ చిత్రం వాల్మీకి మహర్షి రచించిన రామాయణం తర్వాతి భాగానికి సంబంధించినది. సీతారాముల కుమారుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 2.75 కోట్లు.
6. పుష్ప: ది రైజ్ – పార్ట్ 1 (2021)
ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను అంతమొందించి హీరో ఎలా ఆధిపత్యం చెలాయిస్తాడు అనే కథతో తెరకెక్కింది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించారు. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 2.6 కోట్లు.
7. మాయాబజార్ (1957)
బలరాముడు సుభద్రకు తన కుమార్తెను ఆమె కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ కౌరవుల చేతిలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయినప్పుడు, బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాడు. శ్రీ కృష్ణుడు వారిని ఎలా కలిపాడు అనేది సినిమా కథ. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ కలిసి ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య- 2.6 కోట్లు.
8. దేవదాసు (1953) / ప్రేమాభిషేకం (1981) / సాహో (2019)
ఒకప్పుడు అద్భుత విజయాన్ని అందుకున్న ‘దేవదాసు’ (1953), ‘ప్రేమాభిషేకం’ (1981), రీసెంట్ గా తెరకెక్కిన ‘సాహో’(2019) సినిమాలను భారతదేశంలో 2.25 కోట్ల మంది వీక్షించారు.
9. అడవి రాముడు (1977)
అండర్ కవర్ ఆపరేషన్‌లో ఒక అటవీ అధికారి స్మగ్లర్‌లకు గుణపాఠం చెప్పడానికి గిరిజన ప్రజలను, పరిసర గ్రామస్థులను ఎలా ఏకం చేశాడు అనే కథతో ఈ సినిమా రూపొందింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా చేశారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య-2.15 కోట్లు.
10. నర్తనశాల (1963)
ఈ చిత్రాన్ని వ్యాస మహర్షి రచించిన మహాభారతం విరాట పర్వం ఆధారంగా తెరకెక్కింది. ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య-2.1 కోట్లు.
Read Also: లాస్ ఏంజెల్స్‌కు ‘నాటు నాటు’ ఫీవర్, ఆడియెన్స్ డ్యాన్స్‌తో దద్దరిల్లిన థియేటర్