Lata Mangeshkar Death LIVE: లతా మంగేష్కర్ కు ప్రధాని మోదీ అంతిమ నివాళి
Lata Mangeshkar Death LIVE Updates: గాన కోకిల లతామంగేష్కర్ ఇక లేరు. వేల పాటలు పాడి అభిమానులను అలరించిన ఆ గొంతు మూగబోయింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
LIVE
Background
Lata Mangeshkar Death LIVE Updates:
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇక లేరు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 92 సంవత్సరాలు.
‘‘దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ గారి మృతి చాలా బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకు నా హృదయపూర్వక నివాళులు. ఆమె మృతి దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు.. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే, లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా, ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు లతా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
దాదాపు నెల రోజులుగా ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కొద్ది రోజులుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఆమెను వెంటిలేటర్ సపోర్టుపైనే ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె జనవరి 8 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేసింది.
లతా మంగేష్కర్ మరణం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన లతాజీ మరణంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిందని ఉత్తరాఖండ్‌లో ఉన్న జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ మరణించారనే వార్త బాధ కలిగించింది. వారు లేరనేది సినీ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
లతా మంగేష్కర్ కు ప్రధాని మోదీ అంతిమ నివాళి
నేపద్య గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ముంబయి శివాజీ పార్కులో లతా మంగేష్కర్ భౌతిక కాయానికి అంతిమ నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో లతా అంతిమ సంస్కారాలకు నిర్వహించారు. అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
లతా మంగేష్కర్ కు సచిన్, షారుక్ ఖాన్ నివాళులు
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు షారుక్ ఖాన్‌లు ముంబైలోని శివాజీ పార్కులో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు తుది నివాళి అర్పించారు. పుష్ఫగుచ్చాన్ని ఉంచి ప్రముఖులు నివాళి అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
#WATCH | Cricketer Sachin Tendulkar and actor Shah Rukh Khan pay last respect to veteran singer Lata Mangeshkar at Mumbai's Shivaji Park pic.twitter.com/r22Njpi4XW
— ANI (@ANI) February 6, 2022
లతా మంగేష్కర్ కన్నుమూత.. ఛత్తీస్ గఢ్‌లో రెండు రోజులు సంతాప దినాలు
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు ముంబైలోని శివాజీ పార్క్ లో సింగర్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. లతా మంగేష్కర్ గౌరవార్థం ఫిబ్రవరి 7న రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించినట్లు మహారాష్ట్ర సీఎంఓ వెల్లడించింది.
నేటి సాయంత్రం 5:45-6:00 గంటలకు లతాజీ అంత్యక్రియలకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం 5:45-6:00 గంటలకు లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థలానికి చేరుకుంటారు. ఇదివరకే ఆయన ముంబైకి బయలుదేరారు. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని బీఎంసీ కమిషన్ ఇక్బాల్ సింగ్ చహల్ తెలిపారు.