Laal Singh Chaddha Trailer: నాగచైతన్య హిందీ సినిమా ట్రైలర్ వచ్చేసింది - ఆమీర్ హృదయాన్ని తాకుతాడు!
ఆమీర్ ఖాన్, నాగచైతన్య నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ట్రైలర్ ఐపీఎల్ ఫైనల్లో విడుదల అయింది.
ఆమీర్ ఖాన్ హీరోగా, యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదల అయింది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాలో చిన్నతనంలో కాళ్లకు ఏదో వ్యాధి సోకి దాన్ని అధిగమించే పాత్రలో ఆమీర్ ఖాన్ కనిపిస్తున్నారు. ఆమీర్ ఖాన్ ఆర్మీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్‌గా నాగచైతన్య కనిపిస్తుండగా... హీరోయిన్ పాత్రలో కరీనా కపూర్ నటిస్తుంది.
ట్రైలర్‌ను మంచి ఫీల్‌గుడ్ ఎమోషన్‌తో కట్ చేశారు. లాల్ సింగ్ చద్దా జర్నీ హృదయాన్ని తాకేలా ఉండనుందని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. అయితే ట్రైలర్‌లో నాగచైతన్య స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువగా ఉంది. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత ఉండనుందో వస్తే కానీ చెప్పలేం. 1994లో వచ్చిన క్లాసిక్ హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. హాట్‌స్టార్ ఈ ట్రైలర్ తెలుగులో కూడా స్ట్రీమ్ అయింది. కానీ యూట్యూబ్‌లో ఇంకా ఆ వెర్షన్ విడుదల చేయలేదు.
సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అద్వైత్ చహాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ప్రీతం సంగీతాన్ని అందించారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
మొదట ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల కావాల్సి ఉండగా... అదే రోజు కేజీయఫ్: చాప్టర్ 2 కూడా విడుదల అవుతుండటంతో ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేశారు. లాల్ సింగ్ చద్దా కోసం ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాను 2023 సంక్రాంతికి వాయిదా వేశారు.
View this post on Instagram