Kona Venkat: ఎన్‌టీఆర్‌లో ఆ క్వాలిటీ భరించలేం, అదంతా వాళ్ల అమ్మ ట్రైనింగే - కోన వెంకట్
Kona Venkat: ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో ‘అదుర్స్ 2’ గురించి కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అదే విషయంపై మరోసారి ఈ రైటర్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఎన్‌టీఆర్‌తో కనెక్షన్ గురించి చెప్పారు.
Kona Venkat About Jr NTR: ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ కొనసాగుతుండగా.. ఎన్నో ఏళ్ల క్రితం విడుదలయిన చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. కచ్చితంగా దానికి సీక్వెల్ ఉండబోతుంది అనే హింట్‌తో దానిని ముగిస్తున్నారు. అదే విధంగా 2010లో వచ్చిన ‘అదుర్స్’ మూవీకి ఎప్పటికైనా సీక్వెల్ తెరకెక్కిస్తానని, అది కూడా ఎన్‌టీఆర్‌తోనే చేస్తానని రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కోన వెంకట్‌కు మరోసారి ‘అదుర్స్ 2’కు సంబంధించి ప్రశ్న ఎదురయ్యింది.
అదే స్పెషల్..
‘అదుర్స్ 2’ అప్డేట్ ఏంటని అడగగా.. కథ సిద్ధంగా ఉందని బయటపెట్టారు కోన వెంకట్. ‘‘ఎన్‌టీఆర్ ఎప్పుడంటే అప్పుడు సినిమా మొదలవుతుంది. తను ఈ సీక్వెల్ చేయాలి అన్నది నా ఒక్కడి డిమాండ్ మాత్రమే కాదు. నేను ఏ దేశానికి వెళ్లినా నాకు ఒక తెలుగోడి కనిపించాడంటే ముందుగా మాట్లాడేది అదుర్స్ గురించే. తారక్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా తన కెరీర్‌లో స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ సినిమా, స్పెషల్ గెటప్ ఏదైనా ఉంది అంటే అది అదుర్స్. దాంతో తను చాలా ఎంటర్‌టైన్ చేశాడు. తారక్‌లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూనే ఉంటాడు. తనను తాను ఎంటర్‌టైన్ చేసుకుంటూ.. ఇతరులను ఎంటర్‌టైన్ చేయడం తనకు చాలా ఇష్టం. అందుకే తనకు ఆ పాత్ర బాగా సూట్ అయ్యింది’’ అంటూ ఎన్‌టీఆర్ మనస్తత్వం గురించి చెప్పుకొచ్చారు కోన వెంకట్.
కచ్చితంగా చేస్తాం..
‘‘అదుర్స్‌లోని పాత్రలో లీనమయ్యి దానికి ఏం కావాలో అది చేశాడు తారక్. ఆ పాత్ర యొక్క ప్రవర్తనను, బ్రాహ్మణ ఉచ్ఛారణ అన్నింటిని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. దాని వల్ల పాత్ర అద్భుతంగా మారిపోయింది. అందుకే అదుర్స్ 2 అన్నది కేవలం నా డిమాండ్ కాదు. ఆఖరికి మా అమ్మమ్మ, నాన్నమ్మ కూడా అదుర్స్‌లోని ఎన్‌టీఆర్ క్యారెక్టర్‌ను బాగా ఇష్టపడతారు. త్వరలోనే కచ్చితంగా చేస్తామని అనుకుంటున్నాను’’ అని ‘అదుర్స్ 2’ గురించి మాట్లాడారు కోన వెంకట్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ క్రేజ్‌పై ఆయన స్పందించారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ సినిమాలు చేసిన హీరోల్లో ఎన్‌టీఆర్ ఒకడు’’ అంటూ తమ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలను గుర్తుచేసుకున్నారు.
పర్సనల్ కనెక్షన్..
‘‘మేము కలిసి చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్స్, బ్లాక్‌బస్టర్స్. పర్సనల్ కనెక్షన్ కూడా ఎక్కువ ఉంది. తన ప్రేమను తట్టుకోలేం. పర్సనల్‌గా సాంబ సినిమా నుంచి తన కష్టం దగ్గర నుంచి చూశాను. 2 పేజీల సీన్ ఇస్తే ఒకసారి చూసుకొని రెడీ అంటాడు. ఏదీ తేడా రాకుండా చెప్తాడు. డ్యాన్స్ విషయంలో కూడా అంతే. ఒకసారి చూసి రెడీ అంటాడు. రిహార్సెల్ కూడా వద్దంటాడు. సింగిల్ టేక్‌లో చేసేస్తాడు. దేవుడు ఇచ్చిన క్వాలిటీ అది. వాళ్ల అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ కూడా అది. అన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి’’ అంటూ ఎన్‌టీఆర్‌ను తెగ ప్రశంసించేశారు కోన వెంకట్. దీంతో ఫ్యాన్స్ అంతా ‘అదుర్స్ 2’ నిజంగానే వర్కవుట్ అవుతుందేమో అని నమ్మకంతో ఉన్నారు.
Also Read: ప్రియమణి బదులు కీర్తి సురేష్ నటిస్తే - మహానటి 'మైదాన్' వదిలేయడం మంచిదయ్యిందా?