Kiran Abbavaram: నాతో ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీలో ఎదగకూడదా? ట్రోలర్స్‌పై కిరణ్ అబ్బవరం తీవ్ర ఆగ్రహం
KA Pre Release Event: తన మీద కొంత మంది కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని నటుడు కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. ఏం అన్యాయం చేశానని తన మీద ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.
Kiran Abbavaram About Trollers: తెలుగు సినిమా పరిశ్రమలో వరుస చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న నటుడు కిరణ్ అబ్బవరం. 2019లో ‘రాజా వారు రాణీ గారు‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 8 సినిమాల్లో నటించగా నాలుగు సినిమాలు బాగానే ఆడాయి. ఆయన తాజాగా నటించిన ‘క’ అనే మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా తన గురించి ఇండస్ట్రీలో ఓ వర్గం నెగెటివ్ ప్రచారం చేయడంపై ఆవేదనతో పాటు కోపాన్ని వెళ్లగక్కారు.
నాతో ఏంటి మీకు ప్రాబ్లం?
కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. “పవన్ కల్యాణ్ లాంటి వాళ్లకే సాధ్యం కాలేదు. నువ్వు పాన్ ఇండియా సినిమా చేస్తావా” అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఓ సినిమాలో నేరుగా కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేశారు. మరికొంత మంది ఈ హీరో వెనుక ఓ పొలిటీషన్ ఉన్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇవన్నీ తలచుకొని కిరణ్ ఎమోషనల్ అయ్యారు. ట్రోలర్స్ పై నిప్పులు చెరిగారు. తనని తొక్కేసేందుకు కొంత మంది కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ప్రాబ్లెమ్ ఏంటంటూ ప్రశ్నించారు. కిరణ్ అనేవాడు ఎదగ కూడదా? అంటూ ప్రశ్నించారు. “నేను ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు చేశాను. నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయి. నేను ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదు. హిట్స్, ఫ్లాప్స్ అనేవి కామన్. అసలు నాలాంటోడు సినిమాలు తీసి థియేటర్ వరకు రావడమే సక్సెస్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటది. వాళ్ల సినిమాలో నన్ను ట్రోల్ చేశారు. నాతో మీకు ప్రాబ్లం ఎంటి? ఇండస్ట్రీలో ఎంతో మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. ఏ సపోర్టు లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని రవితేజ, నాని, విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్ లాంటి వాళ్లు ఎదగలేదా? ఒక్క చిరంజీవి సక్సెస్ వందల మంది యువకులను ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన నేను, షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి హిట్స్ అందుకుంటే కొంత మంది తట్టుకోలేకపోతున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రోలర్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న నాగ చైతన్య
అటు ఈ వేడుకలో పాల్గొన్న అక్కినేని నాగ చైతన్య, కిరణ్ అబ్బవరంను సముదాయించే ప్రయత్నం చేశారు. ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కంప్యూటర్ కీ బోర్డు ముందు ఉన్నది కదా అని ఏది పడితే రాసే వారి గురించి ఆలోచించవద్దన్నారు. అలాంటి వారికి సినిమాలతోనే సమాధానం చెప్పాలన్నారు.
Also Read: చిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?