Khushboo: అందుకే అతడిని చెప్పుతో కొట్టాను - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఖుష్బూ వ్యాఖ్యలు
ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పలువురు సీనియర్ నటీమణులు పాల్గొన్నారు. అందులో ఖుష్బూ కూడా ఒకరు. ఆ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు ఈ సీనియర్ నటి.
ఈరోజుల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. జాతీయ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సౌత్ సినిమాలు ఎదుగుతున్నాయి. కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో సౌత్ సినిమాలపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటిపై సీనియర్ నటి ఖుష్బూ చెన్నైలో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రియాక్ట్ అయ్యారు. ఇండియన్ సినిమాల గురించి, సౌత్ సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఎవరి వల్ల సౌత్ సినిమాలు ఇంతగా ఆదరణ సాధిస్తున్నాయో వారందరినీ గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా నటిగా పలు సందర్భాల్లో తను ఎదుర్కున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి, ఆ సమయంలో తను రియాక్ట్ అయిన తీరు గురించి కూడా ఖుష్బూ మాట్లాడారు.
హీరోలను అమితంగా ఆదరించడం తప్పు కాదు..
మేము సినిమాల ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాము అంటూ దక్షిణాది సినిమాల గురించి చెప్పుకొచ్చింది ఖుష్బూ. ‘‘మీరు ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్స్ గురించే ఎక్కువగా ఉంటాయి అంటుంటారు. కానీ మేము, సౌత్ ఇండియన్స్ అలాగే ఉంటాము. ఎప్పుడూ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాము. దానికి మేమేం సిగ్గుపడము. అవును మేము హీరోలను దేవుళ్లలాగా పూజిస్తాము. అది కూడా ఇష్టపడే చేస్తాము. మేము రజినీకాంత్‌ను ఆదరిస్తాము, కమల్ హాసన్‌ను ఆదరిస్తాము, విజయ్, అజిత్.. ఇలా అందరినీ వారు ఎలా ఉంటే అలా ఇష్టపడతాము, ఆదరిస్తాము. ఇలా హీరోలను ఆదరించడం అనేది చాలా ఏళ్ల నుండి ఉంది. ఇప్పటికీ అలాగే ఆదరిస్తున్నాం కూడా’’ అంటూ హీరోలను అమితంగా ఆదరించడంలో తప్పు లేదు అని ఖుష్బూ చెప్పారు.
మా కల్చర్‌కు దూరం అవ్వలేదు..
‘‘దక్షిణాది సినిమాల గురించి బెస్ట్ విషయం ఏంటంటే.. మేము నార్త్ కల్చర్‌ను, వెస్టర్న్ కల్చర్‌ను ఒప్పుకున్నాం, దానిని మాలో కలిపేసుకున్నాం. కానీ మేము ఎప్పుడూ మా దక్షిణాది కల్చర్‌ను మా నుండి దూరం చేసుకోలేదు. అంతర్జాతీయంగా సౌత్ ఇండియన్ సినిమా ప్రభావం చూపించడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇండియన్ సినిమా అని చెప్పినప్పుడు ప్రతీ భాషకు అది వర్తిస్తుంది, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమా కూడా అని నేను నార్త్ సినిమాలోని ప్రతీ మనిషితో ఫైట్ చేసేదాన్ని. నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు’’ అని దక్షిణాది కల్చర్ గురించి, సినిమాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ఖుష్బూ.
చెప్పుతో కొట్టాను..
‘‘మలయాళంలో తెరకెక్కుతున్న సినిమాలు చాలా గొప్పగా ఉంటున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’లాంటి సినిమాలతో మణిరత్నం మనకు హిస్టరీ అంటే ఏంటో చూపిస్తున్నారు. ‘విక్రమ్’లాంటి సినిమాలతో కమల్ హాసన్ ఎలాంటి యాక్షన్ చూపిస్తున్నారో చూస్తున్నాం. ఇవే కాకుండా జైలర్, ఆర్ఆర్ఆర్, బాహూబలి లాంటివి కూడా చూశాం. మేము ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. రెహమాన్, రసూల్ కుట్టీ, కీరవాణి, రామ్ చరణ్.. ఇలా ఎవరి గురించి తీసుకున్నా.. మేము సాధించి చూపించాం’’ అని పేరుపేరునా అందరి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు ఖుష్బూ. సినిమాలతో పాటు తను నిజ జీవితంలో ఎదుర్కున్న ఒక చేదు అనుభవాన్ని కూడా గుర్తుచేసుకున్నారు ఈ సీనియర్ నటి. ‘‘ఓ రాజకీయ ర్యాలీలో ఒకరు నాతో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. అందుకే అతడిని చెప్పుతో కొట్టాను’’ అని బయటపెట్టారు ఖుష్బూ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial