Kathi Kantha Rao : కత్తి కాంతారావును మర్చిపోయిన టాలీవుడ్ - శత జయంతికి పరిశ్రమ నివాళి ఎక్కడ? గౌరవం ఏది?
తెలుగు చిత్ర సినిమాలోని తొలి తరం కథానాయకులలో కత్తి కాంతారావు ఒకరు. నేడు ఆయన శతజయంతి. అయితే... పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా నివాళి అర్పించలేదు.
డిమాండ్ అండ్ సప్లై... ఏ వ్యాపారంలోనైనా పాటించే సూత్రం ఇది. సినిమా ఇండస్ట్రీ కూడా అందుకు అతీతం కాదు. ఎవరినైనా సరే డిమాండ్ ఉన్నంత వరకు పట్టించుకుంటారు. తర్వాత పక్కన పడేస్తారు. అందుకు ఉదాహరణ... కత్తి కాంతారావు శత జయంతి. అలాగే, చంద్ర మోహన్ మరణం.
కాంతారావును మర్చిపోయిన తెలుగు చిత్రసీమ!కాంతారావును తెలుగు చలనచిత్ర పరిశ్రమ మర్చిపోయిందని ఈ రోజు చెప్పాల్సి వస్తోంది. ఆయన శత జయంతి నాడు కనీసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా గుర్తు చేసుకుని ఆయనకు నివాళి అర్పించిన పుణ్యం మూట కట్టుకోలేదు. అసలు ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతా రావు అనేది అయినా పరిశ్రమకు గుర్తు ఉందో? లేదో?
తెలుగు తెరపై జానపద కథానాయకుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కాంతారావు. కత్తి పట్టి తెరపై ఆయన చేసిన విన్యాసాలు ఆబాల గోపాలన్నీ అలరించాయి. కాంతారావు నటన మెచ్చిన, కత్తితో ఆయన చేసిన సాహసాలు నచ్చిన జనాలు చివరకు ఆయన ఇంటి పేరునే కత్తిగా మార్చేశారు. అటువంటి కథానాయకుడు శతజయంతి పరిశ్రమకు గుర్తు లేకపోవడం శోచనీయం.
కాంతారావు కేవలం కథానాయకుడు మాత్రమే కాదు... నిజాం ప్రభుత్వంలో వారి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. స్వాతంత్ర సమరయోగంలో బ్రిటిష్ సంగ్రామానికి వ్యతిరేకంగా నాటకాలు వేసిన నటుడు. తరువాత వెండితెరపై ఆయన ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో సంపాదించిన సొమ్మును స్వలాభం కోసం ఏనాడు వాడుకోలేదు. సొంత మనుషులకు ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టలేదు. నటుడిగా సంపాదించిన డబ్బును నిర్మాతగా ఖర్చు పెట్టారు. అదృష్టం ఆయన వైపు లేదు. దాంతో నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చివరకు, మద్రాసులో లంకంత ఇల్లు అమ్ముకుని హైదరాబాద్ వచ్చి అద్దె ఇంట్లో ఉన్నారు. చిన్న చిన్న వేషాలు కూడా వేశారు.
కాంతారావు కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే... కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం నిర్మాతలను అసలు ఇబ్బంది పెట్టని కథానాయకుడు కాంతారావు. అటువంటి హీరోను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.
ఇండస్ట్రీలో వారసులు లేకపోతే ఇంతేనా?
కాంతారావును పరిశ్రమ విస్మరించడానికి కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తే... ఆయన వారసులు ఎవరు సినిమాల్లో లేరనే విషయం గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ శత జయంతిని ఆయన వారసులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆయన వారసులు పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులు ఉన్నత స్థానాలలో ఉండడంతో పరిశ్రమ ప్రముఖులు అందరూ ఆయా హీరోలతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయా హీరోల గొప్పదనాన్ని శతజయంతి నాడు కీర్తించారు. కాంతారావు వారసులు పరిశ్రమకు దూరంగా... ఉద్యోగాలు చేస్తూ స్థిరపడడంతో ఆయనను ఎవరూ పట్టించుకోలేదని మాట అభిమానుల నోట వినిపిస్తోంది. తెలుగు పరిశ్రమ కాంతారావును విస్మరించినప్పటికీ అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచి ఉంటారు.
Also Read : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?
సీనియర్ నటులు చంద్రమోహన్ ఇటీవల మరణించారు. ఆయనకు సైతం చిత్ర సీమ తగు గౌరవాన్ని ఇవ్వలేదని మాట కొందరిలో వినపడుతోంది. సాధారణంగా నటీనటులు, దర్శక - నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎవరైనా మరణిస్తే... ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకువచ్చి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రమోహన్ మరణం తర్వాత ఆయనకు ఆ విధమైన గౌరవం ఏది ఇవ్వలేదు. ప్రభుత్వాలు లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరగలేదు. ఆయనకు వారసులు ఎవరూ లేరు. వారసురాళ్లకు పరిశ్రమతో సంబంధాలు లేవు. దాంతో చంద్రమోహన్ అంత్యక్రియల దగ్గర కొందరు ప్రముఖులు మాత్రమే కనిపించారు.
Also Read : 'భగవంత్ కేసరి' నిర్మాతల మధ్య దూరం - వేర్వేరు కుంపట్లు!?