Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ నివేదించే నైవేద్యాలను మన్రో గంగాళాల్లో పెడతారు. ఇవేంటి? ఈ పేరు ఎందుకు వచ్చింది? ప్రసాదాలకు - కడుపునొప్పికి ఏంటి సంబంధం?

Tirumala News: తిరుమల శ్రీనివాసుడికి నిత్యం ఎన్నో పదార్థాలు నివేదిస్తారు. ఆ పదార్థాలకే కాదు అందుకోసం వాడే పాత్రలకు కూడా ప్రత్యేకత ఉందని తెలుసా? అయితే శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి అనే ప్రచారం ఎందుకొచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం...

1800 ప్రాంతంలో తిరుమలలోశ్రీవారి కైంకర్యాలకు, నివేదకు, భక్తులకు ప్రసాద వితరణకోసం వెదురుబుట్టలు వినియోగించేవారు. బయట భక్తులకు అందించే ప్రసాదాలన్నీ కూడా వెదురుబుట్టల్లోనే ఉండేవి. అక్కడక్కడా రామానుజాచార్యుల కూటముల ద్వారా అన్న సంతర్పణ జరిగేది కానీ ఆలయంలో పెట్టిన ప్రసాదాలే భక్తులకు ప్రధాన ఆహారం. 1800 కాలంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటీష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్ గా పనిచేసిన అధికారి పేరు " THOMOS MUNRO ". దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమతో పాటూ కంచి ప్రాంతం కూడా ఆయన ఏలుబడి కింద ఉండేది. క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు, హైందవ సనాతన ధర్మం పట్ల గౌరవభావం లేనివాడు థామస్ మన్రో . విధినిర్వహణలో భాగంగా చాలాసార్లు తిరుమలకు వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకునేవారు కాదు.

తిరుమలలో ఆలయం బయట భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టేవారు. అప్పట్లో శ్రీవారికి నైవేద్యంగా పొంగలి, పులిహోర, దద్ధ్యోజనం ఉండేది. భక్తులంతా ఆ ప్రసాదాన్ని తీసుకుని నేలపై కూర్చుని చేతులతో తినడం చూసి థామస్ మన్రోకి అసహ్యంగా అనిపించింది. పైగా విదేశీయుడు , తినడానికి స్పూన్లు - ఫోర్కులు ఉపయోగించే సంస్కృతి..అందుకే ఇది చూసి ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అనిపించింది. ఇలా గుంపులుగా కూర్చుని..నేరుగా చేత్తో తినడం వల్ల అంటువ్యాధులు, కడుపునొప్పి వచ్చే ప్రమాదాలున్నాయని భావించారు థామస్. అందుకే హిందూ సంప్రదాయం. ప్రసాదాలపట్ల చులకనభావం ఏర్పడింది. వెంటనే తన అధికారాన్ని ఉపయోగించి తిరుమలలో నేరుగా భక్తులు శ్రీవారి ప్రసాదం తినకూడదని ఆదేశాలిచ్చారు.
ఏ కడుపునొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు రద్దు చేశారో..కొద్దిరోజులకు మన్రోకి అదే తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా ఉపశమనం కలగలేదు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచం పట్టారు. అలాంటి పరిస్థితిలో మంత్రాలయం రాఘవేంద్రస్వామిపై గురి కుదిరింది. ఆ ఆలయానికి ధనసహాయం చేసినా కానీ కడుపునొప్పి తగ్గలేదు. థామస్ మన్రోలో వచ్చన ఆధ్యాత్మిక ప్రవర్తనకి, సనాతన ధర్మంపట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు...తిరుమల శ్రీవారి పట్ల తాను చేసిన ఘోరమైన తప్పిదాన్ని గుర్తుచేశారు. తిరుమల క్షేత్రమహిమను వివరించారు. అప్పటికి శ్రీవారి ప్రసాద మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..నేరుగా ప్రసాదం తెప్పించుకుని భక్తిపూర్వకంగా స్వీకరించారు. చేతులతో తిన్నారు..ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి కుదుటపడడం మొదలైంది.
అలా...
తన తప్పు తెలుసుకున్న మన్రో..శ్రీవారి కైంకర్యాలకోసం , నైవేద్యం సమర్పించడం కోసం గంగాళాలు విరాళంగా సమర్పించారు. మళ్లీ మునుపటిలా భక్తులు తిరుమలేశుడి సన్నిధిలో ప్రసాదాలు స్వీకరించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే తప్పు తెలుసుకున్నా, ఎన్ని గంగాళాలు సమర్పించినా కానీ స్వామివారి దర్శనానికి నోచుకోలేకపోయారు. మనోవ్యధతో మంచంపట్టిన మన్రో..నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామీ అని మనసారా ప్రార్థిస్తూ 1827లో ప్రాణంవదిలారు. ఆ భక్తికి మెచ్చిన స్వామివారు నాటి నుంచి నేటివరకూ మన్రో ఇచ్చిన గంగాళంలోనే అన్ని రకాల ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

మన్రో గంగాళారు పేరుతో ఇప్పటికీ దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి. స్వామివారి భక్తికి నేరుగా నోచులేకపోయినా ఆయన పేరుమీద ప్రసాద వితరణ జరుగుతూనే ఉంది. భారతీయులపట్ల , మేధావుల పట్ల, చేతి వృత్తులు చేసేవారిపట్ల మన్రోకి ఎంతో గౌరవం ఉండేది. తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్న థామస్ మన్రో రాయలసీమ రైతులతో తెలుగులోనే మాట్లాడేవారు. తన కింది అధికారులకు కూడా అదే ఆదేశించేవారట. భారతీయులను పెద్ద పదవుల్లో నియమించారు మన్రో. ఇందులో భాగంగా ధర్మవరం ప్రాంతానికి చెందిన దేశాయి నారాయణప్పను 800 రూపాయల నెల వేతనంపై మద్రాసు రెవెన్యూ బోర్డు దివానుగా నియమించారు. మైసూరు దివాన్ పూర్ణయ్య వద్ద శిక్షణ తీసుకున్న బచ్చేరావు కార్యదక్షతను గుర్తించి కడప తాలూకా పుట్టంపల్లె, పులివెందుల తాలూకా ఇడుపులపాయ గ్రామాలను జాగీరుగా ఇచ్చారు.
1827 జూలై 6న మరణించారు మన్రో. ఆయన శరీరాన్ని గుత్తిలో యూరోపియన్ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని వెలికితీసి మద్రాసులో సెయింట్ జార్జి కోటలోని సెయింట్ మేరీస్ చర్చి ఆవరణలో సమాధి చేశారు. మన్రో పేరుమీద గుత్తిలో ఇప్పటికీ సత్రం ఉంది. రాయలసీమ రైతులపాలిట పెన్నిధిగా మన్రో శిలా విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట స్థాపించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.
ఇక తిరుమల శ్రీవారికి ఏ ఏ సేవలున్నాయి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా! ఈ లింక్ క్లిక్ చేయండి






















